భారత్- సౌతాఫ్రికా మధ్య సెంచూరియన్ లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఆతిథ్య సౌతాఫ్రికా ఘనవిజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగులు మాత్రమే చేసి విఫలమైన రోహిత్ సేన రెండో ఇన్నింగ్స్ లో మరింత దారుణమైన ప్రదర్శన కనబరిచింది. 131 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్ లో రాహుల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ-76; శుభ్ మన్ గిల్-26 మాత్రమే రాణించారు. మిగిలిన అందరూ సింగల్ డిజిట్ కే పెవిలియన్ చేరారు.
తొలి ఇన్నింగ్స్ లో నిన్న రెండోరోజు ఆట ముగిసే సమయానికి 11 పరుగుల ఆధిక్యంతో నేడు మూరోజు ఆట మొదలు పెట్టిన సౌతాఫ్రికా 408 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఎల్గర్ 185 పరుగులు చేసి డబుల్ సెంచరీ కి చేరువలో ఔటయ్యాడు. మార్కో జాన్సెన్-84; బెడింగ్ హామ్-56 పరుగులు చేశారు. ఇండియా బౌలర్లలో బుమ్రా-4; సిరాజ్-2; ఠాకూర్, ప్రసిద్ కృష్ణ, అశ్విన్ తలా ఒక వికెట్ సాధించారు.
163 పరుగులు వెనకబడి రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్ ఐదు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాట్స్ మెన్ వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. విరాట్ 76 పరుగులు చేసి చివరి వికెట్ గా వెనుదిరిగాడు. 131 పరుగులకే చాప చుట్టేయడంతో ఓటమి తప్పలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో బల్గర్ 4; మార్కో జాన్సెన్ 3; రబడ 2 వికెట్లతో రాణించారు.
డీన్ ఎల్గర్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.
రెండు టెస్టుల సిరీస్ లో చివరి మ్యాచ్ జనవరి 03న కేప్ టౌన్ లో మొదలు కానుంది.