అదీ సంగతి. మగవాళ్ళు ఇంతింత లావు కావడానికి పెళ్ళే కారణం తప్ప మరొకటి కానే కాదు. పెళ్ళికి ముందు నాజూగ్గా, రివటలా, ఎండు పుల్లల్లా ఉన్నవారు...పెళ్ళయ్యాక కదల్లేని పర్వతాల్లా తయారుకావడానికి శాస్త్రీయమైన కారణాలు దొరికిపోయాయి. కదిలి వచ్చే మేరునగంలా ఉంటే తీగలాంటి అమ్మాయిలెవరూ ఇష్టపడరన్న ఎరుకకొద్దీ ఎంతోకొంత శరీరంపై శ్రద్ధ పెట్టి ఊబకాయం రాకుండా జాగ్రత్త పడతారట. కొంచెం లావు కాగానే వ్యాయామం చేసో, ఆహారం తగ్గించో సన్నబడడానికి ప్రయత్నిస్తారట. పెళ్ళయ్యాక ఆ శ్రద్ధ ఉండదట. శరీరంపై నిర్లక్ష్యం ఆవహిస్తుందట. పైగా గంటలు గంటలు కూర్చుని చేసే ఉద్యోగాలు. ఇలా సవాలక్ష కారణాలతో మగవారు బాగా లావెక్కుతున్నారు. బలిసి కొవ్వెక్కుతున్నారు. మహిళలక్కూడా ఇంతే కదా! పెళ్ళయ్యాక ఎలా ఉంటే ఏముందిలే? అని వారు కూడా పర్వతాలతో పోటీలు పడాలి కదా? అంటే కొంతవరకు ఇది నిజమే అయినా వారి శరీర నిర్మాణం, పనులే వారికి అనుకూలమని పోలాండ్ వార్సా యూనివర్సిటీలో జరిపిన ఒక అధ్యయనంలో తేలింది.
ప్రపంచ జనాభాలో ఊబకాయంతో బాధపడుతున్నవారి సంఖ్య 250కోట్లకు చేరిందట. ఇందులో పిల్లలు, పెద్దలు అందరూ ఉన్నారు. 1990 నుండి ఈ సమస్య ఎక్కువైనట్లు గుర్తించారు. 2050 నాటికి పిల్లల్లో మూడో వంతు, వయసు మళ్లినవారిలో సగం మంది ఊబకాయంతో బాధపడతారని అంచనా. ఊబకాయంతో వచ్చే ఇతర ఆరోగ్యసమస్యలు మరింత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. నిత్యం వ్యాయామం; మితాహారం; ధూమపానం, మద్యపానం మానేయడం మీద దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు.
అధిక కెలొరీలు తినడం, విపరీతంగా ఉప్పు, తీపి వాడడం, ప్యాక్డ్ ఫుడ్డు తినడంతో మనదగ్గర పిల్లలు కొండల్లా ఊబకాయులవుతున్నారని డాక్టర్లు మొత్తుకుంటున్నారు. ఆహారం ఎక్కువరోజులు నిలువ ఉండడానికి వాడే రసాయనాలతో పిల్లలకు రాకూడని ఆరోగ్య సమస్యలొస్తున్నాయని రుజువవుతున్నా ప్యాక్డ్ ఫుడ్డు పరిశ్రమ దినదిన ప్రవర్ధమానమవుతోందే కానీ…తగ్గడం లేదు.
ఈ సమస్య ఇలా ఉంటే…మరోవైపు ఈ సమస్యను సొమ్ము చేసుకునేవారు; చిటికెలో బరువు తగ్గిస్తామంటూ స్వయం ప్రకటిత పరిశోధకులు; వైద్యులు కాని వైద్యులు వీధికొకరు.
సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవులు ఉడికిన అన్నం తిననే తినవని, మనిషి ఒక్కడే ఉడికించి, వేయించి, కాల్చుకు తింటున్నాడని…కాబట్టి మనం కూడా పచ్చి మాంసం, పచ్చి కూరలు తినాలని ఒకడు సిద్ధాంతీకరిస్తాడు. సృష్టిలో పెద్దయ్యాక కూడా పాలు తాగేది మనిషి ఒక్కడే, ఆ పాలే సకల రోగాలకు కారణం…కాబట్టి తక్షణం పాలు, పాల పదార్థాలను మానేస్తే మనిషికి రోగాలే రావని ఒకడు ప్రామాణీకరిస్తాడు. అన్ని ఆహారాలు మానేసి పాలు, పెరుగు, మీగడ, వెన్న, నెయ్యి ముప్పూటలా తింటే శ్రీకృషుడిలా 125 ఏళ్లు బతికేయవచ్చని ఒకాయన వీరలెవెల్లో ఉద్యమిస్తాడు. చిరు ధాన్యాలు తింటే చిరంజీవులుగా ఉండిపోవచ్చని ఒకాయన బయలుదేరుతాడు. అన్నం మాని పళ్లు తింటే వసిష్ఠుడిలా యుగయుగాలు బతికేయవచ్చని ఒకాయన ప్రవచిస్తాడు.
పచ్చి కూరలే దివ్యౌషధం అని ముప్పూటలా ప్రకృతి ఆశ్రమాలు నోళ్లల్లో టన్నుల కొద్దీ కూరలు కుక్కుతుంటే నాగేశ్వర్ రెడ్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వలేక కడుపు పట్టుకోవాలి.
ఇలాంటి ఏ శాస్త్రీయ ఆధారాలు, ప్రయోగశాలల్లో తేల్చిన రుజువులు, ప్రభుత్వ ఔషధ నియంత్రణ విభాగాల అనుమతులు లేని మందులు, ఆహార విధానాల గురించి మీడియాలో లెక్కలేనన్ని ప్రకటనలు. వేల, లక్షల కోట్ల వ్యాపారం.
మొత్తమ్మీద ఆహార, ఆరోగ్య వాతావరణాన్ని పాడుచేసి పెట్టారు. అదో విషాద గాథ. అంతులేని కథ.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018