ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఆసెంబ్లీ స్పీకర్ కు వైఎస్ జగన్ రాసిన లేఖ బెదిరింపు ధోరణితో ఉందని రాష్ట్ర ఆర్ధిక, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ జరగడానికి ఎంత మందితో కోరం ఉండాలో అంతమంది ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సభా నిబంధనల్లో స్పష్టంగా ఉందని, మొత్తం సభ్యుల్లో పది శాతం మంది ఉండాలని వెల్లడించారు. దీనిద్వారా ప్రతిపక్ష నాయకుడి హోదా పొందే అవకాశం లేదని జగన్ కు లేదని కేశవ్ స్పష్టం చేశారు. మొత్తం సభ్యుల్లో పదో వంతు సీట్లు ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా ఇస్తారని, జగన్ ఫ్లోర్ లీడర్ మాత్రమే. ప్రతిపక్ష నేతగా ఉంటే కేబినెట్ హోదా వస్తుందని జగన్ భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. 1984లో రాజ్యసభ ఎంపి ఉపేంద్ర, 1994లో పి.జనార్దన్ రెడ్డిలకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, ఫ్లోర్ లీడర్ హోదా మాత్రమే ఉండేదని గుర్తు చేశారు.
ఎప్పుడూ తన వ్యాపారాల గురించే ఆలోచించే జగన్ ఇకనైనా ప్రజల గురించి ఆలోచించాలని కేశవ్ సూచించారు. ఆయన సభకు వచ్చి మిగతా అందరు ఎమ్మెల్యేలు లాగానే ఆయన కూడా మాట్లాడే అవకాశం ఉపయోగించుకోవాలన్నారు. 2014, 19 ఎన్నికల తరువాత లోక్ సభలో తగిన సంఖ్యా బలం లేనందువల్ల కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, కేవలం ఫ్లోర్ లీడర్ గా మాత్రమే గుర్తించారని అలాగే జగన్ కు కూడా ప్రతిపక్ష హోదా రావడానికి మరో పదేళ్ళు పడుతుందని జోస్యం చెప్పారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలు వెతుక్కోకుండా, ప్రజలను తప్పుబడుతున్నారని విమర్శించారు.
కౌలన్ షక్దర్ రూల్స్ బుక్ ను జగన్ ఓసారి చదవాలని, ఆయనకు ఆ ఓపిక లేకపోతే చదివి వాటి గురించి చెప్పేవారిని పక్కన పెట్టుకోవాలని అన్నారు.