బంగాళాఖాతంలో ‘అసని‘ తుపాను తీవ్రమవుతూ గడిచిన 6 గంటల్లో గంటకు 7 కి.మీ వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం కాకినాడకు 330 కి.మీ., విశాఖపట్నంకు 350 కి.మీ., గోపాలపూర్ కు 510 కి.మీ., పూరీకు 590 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఈరోజు రాత్రికి క్రమంగా ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చి అనంతరం దిశ మార్చుకుని ఉత్తరాంధ్ర – ఒడిశా తీరాలకు దూరంగా ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ వాయువ్య బంగాళాఖాతం వైపు వెళ్ళే అవకాశం ఉంది. తదుపరి 12 గంటల్లో క్రమంగా తీవ్రతుపాను నుంచి తుపానుగా బలహీనపడే అవకాశం.
తుపాను ప్రభావంతో ఈరోజు కోస్తాంధ్రలో, రేపు ఉత్తరాంధ్రలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40-60 కిమీ వేగంతో గాలులు వీస్తాయి. సహాయక చర్యలకు SDRF, NDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్, డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తుపాను నేపధ్యంలో ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లా యాత్రాంగాన్ని అప్రమత్తం చేసిన విపత్తుల సంస్థ. సముద్రం అలజడిగా ఉండటంతో గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని, రైతులు ముందుగానే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు.