అస్సాం లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రూప్ జ్యోతి కుర్మి పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. జోర్హాట్ జిల్లా మరియాని నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కుర్మి తన రాజీనామ లేఖను ఈ రోజు స్పీకర్ బిస్వజిత్ దైమెరి కి అందచేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని నడిపించి దిశా నిర్దేశం చేయకలిగిన సమర్థత రాహుల్ గాంధీ కి కొరవడిందని విమర్శించారు. రాహుల్ గాంధి నాయకత్వ లోపం వల్లే అస్సాంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని కుర్మి ఆరోపించారు.
కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ లో ఉంటుందని గౌహతిలో ఉండే వృద్ద నాయకులు ఎవరిని పట్టించుకోరని కుర్మి మండిపడ్డారు. వరుసగా నాలుగుసార్లు శాసనసభకు ఎన్నికైన నేత రూప్ జ్యోతి కుర్మి పార్టీకి, పదవికి రాజీనామా చేయటం ఈశాన్య రాష్ట్రాల కాంగ్రెస్ నేతలను కలవర పరుస్తోంది. కుర్మి త్వరలోనే కమలం తీర్థం తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఉత్తరప్రదేశ్ లో జితిన్ ప్రసాద బిజెపిలో చేరటం, రాజస్థాన్ లో సచిన్ పైలట్ ఏ క్షణం లో ఏం నిర్ణయం తీసుకుంటాడో తెలియని ఉత్కంట కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అటు పంజాబ్ లో సిఎం అమరింధర్ సింగ్, నవజ్యోత్ సింగ్ మధ్య సంబంధాలు ఉప్పు నిప్పులా ఉన్నాయి. కాంగ్రెస్ లో గ్రూప్ తగాదాలు షరా మామూలే అయితే అస్సాం ఎమ్మెల్యే రాహుల్ గాంధీ పై ఆరోపణలు చేసి రాజీనామా చేయటం చర్చనీయంశంగా మారింది.