పాకిస్తాన్ లో మైనారిటీలపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. ముఖ్యంగా హిందువులపై దాడులు పెరుగుతున్నాయి. తాజాగా కొందరు దుండగులు సతాన్ లాల్ అనే హిందూ వ్యాపారిని కాల్చి చంపారు. సింద్ రాష్ట్రంలోని ఘోట్కి జిల్లా దహర్కి పట్టణంలో ఈ దారుణం చోటుచేసుకుంది. దహర్కి పట్టణంలో వాణిజ్య కూడలిలో ఉన్న రెండు ఎకరాల భూమి తక్కువ ధరకే అమ్మాలని కొన్ని నెలలుగా కొందరు వ్యక్తులు సతాన్ లాల్ పై ఒత్తిడి చేస్తున్నారు. పాకిస్తాన్ విడిచి వెళ్లాలని హెచ్చరిస్తున్నారు. అయితే తనకు వారసత్వంగా వచ్చిన భూమిని అమ్మేది లేదని లాల్ తెగేసి చెప్పాడు. తనకు వస్తున్న బెదిరింపులపై పాకిస్తాన్ సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా బాధితుడు ఫిర్యాదు చేశాడు. వీటన్నింటితో కూడిన వీడియో ఇప్పుడు పాకిస్తాన్, భారత దేశాల్లో వైరల్ గా మారింది.
హిందూ వ్యాపారి సతాన్ లాల్ మృతికి నిరసనగా కరాచీ – క్వెట్ట జాతీయ రహదారిపై హిందూ సంఘాలు, ప్రజా సంఘాలు ధర్నాకు దిగాయి. ఆందోళనకారులకు మద్దతుగా రాజకీయ పార్టీలకు రంగంలోకి దిగటంతో జాతీయ రాహదారి మీద రాకపోకలు నిలిచి పోయాయి. జనవరిలో అనాజ్ మండి పట్టణంలో సునీల్ కుమార్ అనే హిందూ వ్యాపారిని కొందరు అగంతులు సమీపం నుంచే కాల్చి చంపారు. సునీల్ హత్య మరచి పోకముందే సతాన్ లాల్ కాల్చివేత పాకిస్తాన్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇద్దరి హత్యల్లో నిందితులు ఎవరు అనేది బహిరంగా రహస్యమే అయిన పోలీసులు, ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు తీసుకోవటం లేదని ముస్లీం లీగ్ శాసనసభ్యుడు ఖేహళ్ దాస్ కోహిస్తాని ఆరోపించారు.
కొన్నేళ్లుగా సింద్, బెలూచిస్తాన్ రాష్ట్రాల్లో హిందువులు, అహ్మదీయులు, క్రైస్తవులపై దాడులు పెరిగాయని పాకిస్తాన్ మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం శాంతిభద్రతల రక్షణలో విఫలమైందని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఈ నెలాఖరులో కరాచీ నుంచి ఇస్లామాబాద్ కు లాంగ్ మార్చ్ కు పెలుపు ఇచ్చింది.
Also Read : ఇమ్రాన్ ఖాన్ పాలనపై నిరసనలు