వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 155 సీట్లతో విజయ దుందుభి మోగిస్తుందని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసులు వైసీపీ కార్యకర్తల కంటే దారుణంగా పని చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనకు తెలుగుదేశం పిలుపునిచ్చింది. శ్రీకాకుళంలో జరిగిన ఆందోళనా కార్యక్రమాల్లో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. కోటబొమ్మాళి నుంచి కొత్తపేట వరకూ జరిగిన ర్యాలీలో అచ్చెన్నాయుడు తో పాటు రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి అచ్చెన్నాయుడు మట్లాడుతూ తనను అరెస్టు చేస్తే తెలుగుదేశం పార్టీ బలహీనపడుతుందని సిఎం జగన్ అనుకున్నారని, తనను జైల్లో పెట్టి తమ గ్రామ పంచాయతీని గెల్చుకోవాలని చూశారని, కానీ వారి ఆటలు సాగలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరుగులేని మెజార్టీతో విజయం సాధిస్తుందని, తమపై, తమ పార్టీ కార్యకర్తపై కేసులు పెట్టిన ఏ ఒక్క అధికారినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
పార్టీని ఎంత అణగదొక్కాలని చూస్తే అంత బలంగా ఎదుగుతుందని, అధికార పార్టీ బెదిరింపులకు, దాడులకు భయపడే ప్రసక్తే లేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి పెట్రోల్, డీజిల్ రెట్లు పెంచి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఈ ధర్నాలో జిల్లా టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.