baseless: పెగాసస్ వ్యవహారంపై వైఎస్సార్సీపీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెగాసస్ ద్వారా విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసిందని, దీనిపై రాజ్యసభలో చర్చ జరగాలని మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, మరికొందరు విపక్ష నేతలు డిమాండ్ చేసినప్పుడు దీనిపై చర్చ అవసరం లేదని విజయసాయిరెడ్డి వైసీపీ రాజ్యసభపక్ష నేతగా చెప్పారని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. మీ కేసులకు భయపడి ఆ విధంగా చెప్పారా, కేసులకు భయపడే చర్చ వద్దన్నారా? అని ప్రశ్నించారు.
ఈ అంశంలో చంద్రబాబు పేరు కావాలనే తీసుకొచ్చారని, వైసీపీ ఎన్నికల వ్యూహకర్త పీకే మమతకు కూడా అడ్వైజర్ గా ఉన్నారని, అయన డ్రామాలోనే భాగంగానే ఇది జరిగిందన్నారు. ప్రభుత్వంలో మీరే ఉన్నారని, రికార్డులు- కాగితాలు మీవద్దే ఉన్నాయని, చంద్రబాబు నిజంగా కొని ఉంటే ఆ లెక్కలు మీ వద్దే ఉంటాయని సమగ్ర విచారణ జరిపించుకోవచ్చని సవాల్ విసిరారు. ఎవరు తప్పు చేశారో వాస్తవాలు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబుపై ఇటువంటి చౌకబారు విమర్శలు మానుకోవాలని, మూడేళ్ల పాలనలో ఎన్నో అబద్ధాలు చెప్పారని, లేనివి సృష్టించి, ఇంకా మీ పాలన చివరి వరకూ దానిమీదే బతుకుతామంటే మీ ఖర్మ అంటూ అచ్చెన్న తీవ్రంగా మండిపడ్డారు.