Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Cricket World Cup: విజేత ఆస్ట్రేలియా

Cricket World Cup: విజేత ఆస్ట్రేలియా

వరల్డ్ కప్ క్రికెట్ -2023 టైటిల్ ను ఆస్ట్రేలియా గెల్చుకుంది. వన్డే క్రికెట్ చరిత్రలో ఆరోసారి ఈ టైటిల్ సాధించిన ఘనత వహించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇండియాపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్…ఇండియాను 240 పరుగులకే కట్టడి చేసింది. ఈ లక్ష్యాన్ని 43 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కంగారూలు 47 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన దశలో ట్రావిస్ హెడ్ – లబుషేన్ లు క్రీజులో నిలదొక్కుకొని 192 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి విజయానికి బాటలు వేశారు. 120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 137 పరుగులు చేసిన హెడ్ విజయానికి మరో 2 పరుగుల దూరంలో ఉండగా ఔట్ కావడం గమనార్హం. లబుషేన్ మరో ఎండ్ లో ట్రావిస్ కు చక్కని సహకారం అందించి 58 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మాక్స్ వెల్ 2 (నాటౌట్); డేవిడ్ వార్నర్-7; స్టీవ్ స్మిత్-4; మిచెల్ మార్ష్-15 పరుగులు చేశారు.

ఇండియా బౌలర్లలో బుమ్రా 2; షమీ, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.

అంతకుముందు ఇండియా తొలి వికెట్ కు 30 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ విఫలమై కేవలం నాలుగు పరుగులే చేసి వెనుదిరిగాడు. మంచి ఫామ్ లో ఉన్న రోహిత్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 47 రన్స్ సాధించి అర్ధ శతకం ముంగిట ఓ సులభమైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ సైతం (4) విఫలమయ్యాడు. కోహ్లీ-రాహుల్ లు నెమ్మదిగా ఆడుతూ నాలుగో వికెట్ కు 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కోహ్లీ -54 (63 బంతుల్లో 4 ఫోర్లు); కెఎల్ రాహుల్ 107 బంతుల్లో 1 ఫోర్ తో 66 పరుగులు చేసి ఔటయ్యారు. సూర్య కుమార్ యాదవ్ 18 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. జడేజా-9; షమి-6; బుమ్రా-1, కుల్దీప్ యాదవ్-10 పరుగులు చేశారు. 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మిచెల్ స్టార్క్ 3; హాజెల్ వుడ్, కమ్మిన్స్ చెరో 2; మాక్స్ వెల్, జంపా చెరో వికెట్ సాధించారు.

ట్రావిస్ హెడ్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

విరాట్ కోహ్లీకి ప్లేయర్ అఫ్ ద టోర్నమెంట్ లభించింది.

భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లేస్ చేతుల మీదుగా ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్ ట్రోఫీ అందుకున్నాడు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్