Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్ఆస్ట్రేలియా థ్రిల్లింగ్ విక్టరీ: పాక్ కు నిరాశ

ఆస్ట్రేలియా థ్రిల్లింగ్ విక్టరీ: పాక్ కు నిరాశ

Australia To Take On New Zealand In T20 World Cup Final :

ఆస్ట్రేలియా టి­20 వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. నేడు ఉత్కంఠభరితంగా జరిగిన రెండో సెమీ ఫైనల్లో పాకిస్తాన్ పై ఆసీస్ మరో ఓవర్ మిగిలి ఉండగానే, ఐదు వికెట్లతో సూపర్ విక్టరీ సాధించింది. మార్కస్ స్టోనిస్, మాథ్యూ వాడే అద్భుతంగా రాణించి ఐదో వికెట్ కు 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి విజయం అందించారు. స్టోనిస్ 31 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 40;  వాడే 17 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు భారీ సిక్సర్లతో 41 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.

పాకిస్తాన్ విసిరిన 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కు తొలి ఓవర్లోనే గట్టి దెబ్బ తగిలింది. కెప్టెన్ ఆరోన్ పించ్ డకౌట్ అయ్యాడు. ఆస్ట్రేలియా టాపార్డర్ లో ఓపెనర్ డేవిడ్ వార్నర్-49 (30 బంతులు, 3ఫోర్లు, 3 సిక్సర్లు),  మిచెల్ మార్ష్-29 మాత్రమే రాణించారు. పించ్ తో పాటు స్టీవ్ స్మిత్-5, గ్లెన్ మ్యాక్స్ వెల్-7 కూడా నిరాశ పరిచారు. 96 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన దశలో స్టోనిస్, మాథ్యూ ఇద్దరూ ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీనితో ఈ సిరీస్ లో వరుస విజయాలతో సెమీఫైనల్లో అడుగుపెట్టి, రెండోసారి టి-20 కప్ గెల్చుకోవాలన్న పాకిస్తాన్ ఆశలకు గండిపడింది. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టగా, మరో వికెట్ షాహీన్ అఫ్రిది కి దక్కింది.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ ఓపెనర్లు రిజ్వాన్, కెప్టెన్ బాబర్ ఆజమ్ లు తొలి వికెట్ కు 71 పరుగులు జోడించారు. బాబర్ 39 స్కోరు చేశాడు. రెండో వికెట్ కు రిజ్వాన్, ఫఖర్ జమన్ లు 72 భాగస్వామ్యం నమోదు చేశారు. రిజ్వాన్ 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫఖర్ 32 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ రెండు, కమ్మిన్స్, జంపా చెరో వికెట్ పడగొట్టారు.

మాథ్యూ వాడే కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

ఆదివారం ఇదే దుబాయ్ వేదికగా న్యూ జిలాండ్- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Also Read : సెమీస్ కు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా

RELATED ARTICLES

Most Popular

న్యూస్