టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ లో ఇండియాకు స్వర్ణపతకం లభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్.హెచ్.1 విభాగంలో మన దేశానికి చెందిన అవని లేఖరా స్వర్ణపతకం సాదించింది. పారాలింపిక్స్ లో ఇండియాకు స్వర్ణపతకం సాధించిన మొదటి మహిళగా అవని చరిత్ర సృష్టించింది.
249.6 పాయింట్లతో పారాలింపిక్స్ లో రికార్డు తిరగరాసిన అవని ఇప్పటివరకూ ఉన్న ప్రపంచ రికార్డును కూడా సమం చేసింది. చైనాకు చెందిన ఝాంగ్ 248.9 మీటర్లతో రజత, ఉక్రెయిన్ కు చెందినా ఇరీనా కాంస్య పతాకాలు సాధించారు.
రాజస్థాన్ జైపూర్ కు చెందిన 19 ఏళ్ళ అవని లేఖరా ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్ లో ఐదో స్థానంలో కొనసాగుతోంది. పారాలింపిక్స్ లో మన దేశానికి స్వర్ణ పతకం అందించిన నాలుగో క్రీడాకారిణిగా కూడా ఆమె రికార్డులకెక్కింది. గతంలో మురళీకాంత్ పటేకర్ (స్విమ్మింగ్ – 1972), దేవేంద్ర ఝాఝారియా (జావెలిన్ త్రో – 2004, 2016) లో స్వర్ణాలు సాధించారు.