అదొక అద్భుతమైన లోకం … అక్కడివారు చిత్రమైన రూపు రేఖలతో .. నీలిరంగు దేహంతో ఉంటారు. అక్కడి అటవీ ప్రాంతమే వారి నివాసం. ఐకమత్యం .. స్వేచ్చా జీవితం .. వింత పక్షులను వాహనాలుగా చేసుకుని ఎక్కడికైనా క్షణాల్లో చేరుకునే నైపుణ్యం వారి సొంతం. అలాంటి ఆ లోకంలోకి స్వార్థంతోనే జేక్స్ అనే మనిషి ప్రవేశిస్తాడు. తాను అనుకున్నది సాధించడం కోసం ‘అవతార్’ రూపంలోకి మారతాడు. అయితే అక్కడికి వెళ్లిన తరువాత వారి విశ్వాసానికి కట్టుబడి, తనని పంపించినవారిపైనే వ్యతిరేకత వ్యక్తం చేస్తాడు.

ఇక ఇప్పుడు ‘అవతార్’ ప్రజలకు అండగా నిలిచిన జేక్స్ ను అంతమొందిస్తే తప్ప, తాము  అనుకున్నది సాధించలేమని అతని పైఅధికారులు భావిస్తారు. ఆ పనిని క్వారిచ్ అనే వీరుడికి అప్పగిస్తారు. అతను .. అతని సైన్యం అంతా కూడా ప్రయోగశాల ద్వారా ‘అవతార్’ ల రూపురేఖలను సంతరించుకుని అక్కడ అడుగుపెడతారు. అప్పుడు ఏం జరుగుతుంది? దాన్ని పర్యవసానాలు ఎలాంటివి? అనేదే కథ.

జేమ్స్ కామెరూన్ దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా, నిన్ననే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదలైంది. టెక్నాలజీపై జేమ్స్ కామెరూన్ కి ఉన్న పట్టు గురించి ప్రత్యేకించి చెప్పుకోవలసిన అవసరం లేదు. ఆ టెక్నాలజీ తోనే తెరపై ఆయన అద్భుత విన్యాసాలు చేశాడు. ఆకాశవాసులు .. అరణ్యవాసులు .. సముద్రవాసులు అంటూ, కథను ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి షిఫ్ట్ చేస్తూ, అద్భుతమైన దృశ్యాల మధ్య ప్రేక్షకులను బంధించాడు.

యాక్షన్ .. ఎమోషన్ ఈ రెండూ  కూడా విజువల్స్ ను తోడుచేసుకుని ముందుకు వెళతాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వీటికి అదనపు బలంగా నిలుస్తుంది. ఫొటోగ్రఫీ ఆశ్చర్యచకితులను చేస్తుంది. కథ .. పాత్రలను మలిచినతీరు .. సాంకేతిక పరిజ్ఞానం .. విజువల్ ట్రీట్ అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. థియేటర్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ప్రేక్షకులు మరో లోకంలో విహరిస్తారనడంలో అనుమానం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *