Tuesday, September 17, 2024
HomeTrending NewsBJP: లోకసభ ఎన్నికల్లో మళ్ళీ రామబాణం

BJP: లోకసభ ఎన్నికల్లో మళ్ళీ రామబాణం

2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం బిజెపి అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటోంది. మూడో దఫా కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. హాట్రిక్ కొడితే ప్రధాని నరేంద్ర మోడీ భారత చరిత్రలో నిలిచిపోతారు. కాంగ్రెసేతర నేతగా మూడుసార్లు ప్రధాని పదవి అలంకరించటం జరిగితే…కమలం పార్టీకి భారీ విజయమనే చెప్పుకోవాలి.

దిశదశ లేని మహిళా బిల్లు ఆమోదించినా ఫలితాలు ఇచ్చే అవకాశం లేదని బిజెపి నాయకత్వం గుర్తించినట్టు కనిపిస్తోంది. మహిళా బిల్లు గురించి ఏ నేత గట్టిగా మాట్లాడటం లేదు. దీంతో ఎన్నికల వేళ మరోసారి రామబాణం సంధించేందుకు కమలనాథులు సిద్దం అయ్యారు.

రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం 2024 జనవరి 22న మధ్యాహ్నం 12:30 గంటలకు నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించి అయోధ్యలో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి తర్వాత రామలల్లా ప్రతిష్ఠాపన ప్రక్రియ ప్రారంభించి.. 10 రోజుల పాటు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ ట్రస్టు నిర్ణయించింది. మూడంతస్తుల్లో నిర్మిస్తున్న అయోధ్య రామాలయ భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌ పనులు డిసెంబర్‌ నాటికి పూర్తవుతాయని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్‌పర్సన్‌ నృపేంద్ర మిశ్రా ఇటీవల తెలిపారు.

శ్రీరామచంద్రుడి జన్మభూమి అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు చంపత్ రాయ్, నృపేంద్ర మిశ్రా, మరో ఇద్దరు ప్రధాని మోదీని కలిసి.. ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. ట్రస్ట్ సభ్యుల అభ్యర్థన మేరకు, ప్రధాని మోదీ ఆహ్వానాన్ని అంగీకరించారు.

జనవరిలో అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ జరిగితే ఉత్తర భారతంలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలపై ప్రభావం చూపుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో బిజెపి మెజారిటీ సీట్లు సాధిస్తే ఎర్రకోటపై మళ్ళీ ప్రధానిగా నరేంద్ర మోడీనే మువ్వన్నెల జెండా ఎగురవేస్తారు.

ఈ నేపథ్యంలో అయోధ్య అంశం కూడా రాబోయే ఎన్నికల్లో అజండాగా మరే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దశాబ్దాలుగా రామజన్మభూమి నినాదం ఎత్తుకున్న బిజెపి…హామీ నిలబెట్టుకున్నామని ఎన్నికల క్షేత్రంలో బలంగా ప్రచారం చేస్తుంది.  బిఎజ్పి రామబాణాన్ని ఇండియా కూటమి ఏ విధంగా ఎదుర్కుంటుందో వేచి చూడాలి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్