Sunday, January 19, 2025
HomeTrending Newsఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగం: చంద్రబాబు

ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగం: చంద్రబాబు

రాష్ట్ర ప్రభుత్వం అన్యాయమైన పద్దతుల్లో విపక్ష నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నాని, ఇది సరికాదని ప్రతిపక్ష నేత, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే ప్రజలపై కేసులు పెడుతున్నారని, ప్రజల కోసం పోరాడుతున్న విపక్షాల నేతలను కూడా అక్రమ కేసు పెట్టి జైల్లో పెడుతున్నారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమా కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. మైలవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ అడ్డుకున్నందుకే దేవినేని ఉమాపై కేసుపెట్టారని ఆరోపించారు. వైసీపీ నేతలు ఉమా, టిడిపి నేతలపై దాడి చేసి వారిపైనే మళ్ళీ ఎదురు కేసుపెట్టడం దారుణమని వ్యాఖ్యానించారు.  ప్రభుత్వ చర్యలను ప్రజలు గమనిస్తున్నరన్నారు.

కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ను పరిశీలించడానికి తమ పార్టీ నేతలతో ఒక నిజ నిర్ధారణ బృందాన్ని నియమిస్తే కోవిడ్ సాకుతో వారి పర్యటనకు అనుమతించకపోవడం శోచనీయమన్నారు. ప్రజలకోసం పోరాడుతున్న వారిని జైళ్లలో పెట్టి నేరస్తులను, మాఫియాను రోడ్లపై వూరేగిస్తున్నారని ధ్వజమెత్తారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే వ్యవహరిస్తే మీరు ఎక్కడుండేవారంటు చంద్రబాబు ప్రశ్నించారు.

గత రెండేళ్లలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ లపై దాడులు పెరిగాయని, వారికి సబ్ ప్లాన్ కూడా అమలు చేయడం లేదని, మరోవైపు వారి రక్షణ కోసం ఉద్దేశించిన అట్రాసిటీ  చట్టాన్ని వినియోగించుకుని విపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు.  తన నలభై ఏళ్ళ సర్వీసులో ఇలాంటి ప్రభుత్వాన్ని, డిజిపిని చూడలేదన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఇలాంటి కేసులకు బెదిరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బాక్సైట్ అక్రమ మైనింగ్ జరిగినట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్దారించిన విషయాన్ని ఈ సందర్భంగా బాబు ప్రస్తావించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్