Thursday, March 28, 2024
HomeTrending NewsAmarnath: బాబుది వెనక చూపు: మంత్రి గుడివాడ

Amarnath: బాబుది వెనక చూపు: మంత్రి గుడివాడ

ఉత్తరాంధ్ర అభివృద్ధి కంటే అమరావతిలో కొన్న భూముల రేట్లు పడిపోతాయనే భయమే చంద్రబాబులో ఉందని,  రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. అక్కడ రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోతుందని, పెట్టిన పెట్టుబడికి తగిన ఆదాయం వస్తుందో రాదోనన్న  భయం బాబుదని ఎద్దేవా చేశారు. త్యాగాలు ఈ ప్రాంత ప్రజలు చేస్తే యోగాలు, భోగాలు అమరావతిలో బాబు చేస్తారని దుయ్యబట్టారు.

విశాఖపై అంత ద్వేషం ఎందుకని బాబును ప్రశ్నించారు. ఈ ప్రాంతం మీద, ఇక్కడి ప్రజల మీద ప్రేమ లేకుండా.. కేవలం ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే బాబు పనిచేసి రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చారని అమర్నాథ్ మండిపడ్డారు. పైగా, ఇక్కడకు వచ్చి బుర్రకథలు చెబుతుంటే తామంతా తానా తందానా అని తలలు ఊపాలా అని బాబును సూటిగా నిలదీశారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే అన్ని అవకాశాలూ ఉన్న విశాఖను సిఎం జగన్ పరిపాలనా రాజధానిగా చేశారని స్పష్టం చేశారు.

బాబు తన సభల ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, సిఎం జగన్ ను తిట్టడానికే పరిమితమయ్యారు కానీ, వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారో చెప్పడం లేదని మంత్రి పేర్కొన్నారు. గత ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు కనీసం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఆ విషయాన్ని కూడా చెప్పలేకపోతున్నారని విమర్శించారు. 14 ఏళ్ళ పాటు సిఎంగా ఉండి రాష్ట్రానికి ఏం చేశారో కూడా చెప్పడం లేదన్నారు. తనకు ముందు చూపు ఉందంటూ బాబు చెబుతున్నారని కానీ ఆయనకు ఉంది వెనకచూపు అని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ను ముందు నుంచి కాకుండా వెనక నుంచి పొడిచారన్నారు. బాబువి ఎప్పుడూ బ్యాక్ డోర్ రాజకీయాలేనని మంత్రి విమర్శలు గుప్పించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్