తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఈనెల 6న హైదరాబాద్ లో సమావేశం కానున్నారు. విభజన అంశాలు, ఆస్తుల పంపకం, నిధుల బకాయిలతో పాటు ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన నదీ జలాల అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
నిన్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి ఆంధ్ర ప్రదేశ్ సిఎం చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావొస్తున్నా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయని, వాటిపై చర్చిద్దామని, జులై 6న సాయంత్రం భేటీ అవుదామని ప్రతిపాదించారు. ఈ లేఖపై రేవంత్ సానుకూల స్పందించినట్లు తెలుస్తోంది. బాబు ప్రతిపాదనకు అంగీకరిస్తూ నేడు జవాబు రాయనున్నట్లు తెలంగాణ అధికార వర్గాల సమాచారం.
ఈ శనివారం 6న ఇరు రాష్ట్రాల సీఎం ల ప్రజాభవన్ లో భేటీ అయ్యే అవకాశం ఉంది. పక్క రాష్ట్రంతో సఖ్యతగా ఉంటామని ఇటీవలి తిరుమల పర్యటనలో కూడా సిఎం రేవంత్ వెల్లడించారు. విభజన అంశాలు, అపరిష్కృత అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుందామనే ఆలోచనలో రేవంత్ ఉన్నారు.