Babu on Alliances: పొత్తులు పెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు గెలిచామని, కొన్నిసార్లు ఓడిపోయామని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎప్పుడు పొత్తులు పెట్టుకున్నా అది రాష్ట్రం, ప్రజల ప్రయోజనాల కోసమే పెట్టుకున్నామని చెప్పారు. తాము ప్రతిసారీ పొత్తుల వల్లే గెలిచామని వైసీపీ చేస్తున్న వాదనను అయన తోసిపుచ్చారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ రాష్ట్రాన్ని నాశనం చేసిందని, ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అవసరమైతే అందరం కలవాల్సి ఉంటుదని చెప్పానని, అదే సందర్భంలో పొత్తులపై మాట్లాడాల్సి వచ్చిందని బాబు స్పష్టత ఇచ్చారు. కుప్పం ప్రాంతీయ ఆసుపత్రి లో ఆక్సిజన్ ప్లాంట్ ను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా పొత్తులపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
తమ పార్టీకి ఓ చరిత్ర ఉందని, దేశ రాజకీయాల్లో ప్రగాఢమైన ముద్ర వేశామని గుర్తు చేశారు. ఓటిఎస్ లాగా వైఎస్ జగన్ కు కూడా ప్రజలు వన్ టైం పాలన అందించారని, రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోదని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని బాబు విమర్శించారు.
వైసీపీ నేతలు కొత్త బిచ్చగాళ్లు అని, వాళ్లకు చరిత్ర గురించి తెలియదని…పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని బాబు మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే పొత్తులు పెట్టుకుంటామని, ఆ విషయం ఎన్నికల సమయంలో ఆలోచిస్తామని స్పష్టం చేశారు. నిన్న పార్టీ కార్యకర్తల సమావేశంలో ఓ కార్యకర్త జనసేన- పవన్ కళ్యాణ్ పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు కదా అని బాబుతో అన్నప్పుడు ‘వన్ సైడ్ లవ్’ సాధ్యం కాదు కదా అని బదులిచ్చారు. పొట్టు లేకుండా బాబు గెలవలేరంటూ వైసీపీ బిజెపి విమర్శలు గుప్పించాయి. దీనిపై చంద్రబాబు స్పందించారు.
జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేశారని, ఈ విధ్వంసకర పాలన పోవాలంటే ధర్మ పోరాటం తప్పనిసరి అని… టిడిపి చేస్తున్న ఈ పోరాటానికి అందరూ కలిసి రావాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
Also Read : ఓటమి భయంతోనే బాబు టూర్: పెద్దిరెడ్డి