రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన గెలుపును ఎవరూ ఆపలేరని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. గతంలో హుదుద్, తిత్లీ లాంటి తుఫాన్లు చూశామని… కానీ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెను తుఫానుగా మారుతోందని, ఈ ధాటికి వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో ‘రా! కదలిరా!’ బహిరంగసభలో బాబు ప్రసంగించారు. ప్రజలకు రవాణా సౌకర్యం లేదని, సరిపడా బస్సులు లేవని కానీ ఈ ముఖ్యమంత్రి రెండు బులెట్ ప్రూఫ్ బస్సులు 20 కోట్ల రూపాయలతో కొనుగోలు చేశారని, ప్రజాధనం ఏవిధంగా దుర్వినియోగం చేస్తున్నారో ఆలోచించాలని కోరారు. సిఎం జగన్ రాష్ట్ర ప్రజలందరినీ పేదరికంలో నెట్టారని, ఏపీని 30 ఏళ్ళు వెనక్కు తీసుకువెళ్ళారని బాబు ఆవేదన వ్యక్తంచేశారు. సిఎం జగన్ చొక్కా చేతులు మడత పెడితే తమ కార్యకర్తలు కుర్చీ మడతపెడతారని, తమ కార్యకర్తలపై చేయి పడితే ఉరికించికొట్టే స్థాయి తమకూ ఉందని అన్నారు. టిడిపి-జనసేన కూటమి సూపర్ హిట్ అని, తాము అభ్యర్ధుల జాబితా ప్రకటించగానే వైసీపీ భయపడిందని, ఇప్పటివరకూ ఆ పార్టీ విడుదల చేసిన జాబితాలోని వారు సమన్వయకర్తలు కానీ అభ్యర్ధులు కారని అంటున్నారని ఎద్దేవా చేశారు. సిద్ధం సభలు పెడుతున్న జగన్ దేనికి సిద్ధమని ప్రశ్నించారు.
ఉత్తరాంధ్రను ఉద్దరిస్తామని హామీ ఇచ్చి ఐదేళ్ళలో నాశనం చేశారని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా గోదావరి నీళ్ళు వంశధారకు అనుసంధానం చేస్తే నీటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే జిల్లాకు సాగునీరు అందించే వంశధార-నాగావళి నదులను అనుసంధానం చేస్తామని బాబు హామీ ఇచ్చారు
రాబోయే 45రోజులపాటు యువకులు రోడ్లపైకి రావాలని, సైకిల్ ఎక్కి తిరగాలని, గ్లాసు చేతులో పట్టుకుని అవసరమైనప్పుడు నీళ్ళు తాగాలని.. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు చొప్పున ఐదేళ్ళలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, యువతకు నిరుద్యోగ భ్రుతి అందిస్తామని వెల్లడించారు. ఏపీ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే రాష్ట్రంలో తమ కూటమి అధికారంలోకి రావాలని, దానికి అందరూ కలిసి రావాలని పిలుపు ఇచ్చారు.