తెలుగుదేశం పార్టీని చూస్తే సిఎం జగన్ కు వెన్నులో వణుకు పుడుతోందని, నిద్రలో కూడా తమ పార్టీయే కలలోకి వస్తోందని… అందుకే తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఏపీ ప్రతిపక్షనేత, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ధైర్యం ఉంటే పోలీసులను ఒక్క నిమిషం బైటపెట్టి రావాలని, అప్పుడు తమ పార్టీ సత్తా ఏమిటో తెలుస్తుందని సవాల్ చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో బాబు ప్రారంభోపన్యాసం చేశారు. పాలకుల్లో విద్వేషం ఉండకూడదని, కానీ ఏపీలో పాలకులు విద్వేషంతో విధ్వంస పాలన సాగిస్తున్నారని విమర్శించారు. డా. సుధాకర్ తో పారంభ మైన విధ్వంసం కానిస్టేబుల్ ప్రకాష్ వరకూ కొనసాగుతూనే ఉందన్నారు. పాలకులకు విజన్ ఉండాలి కానీ విద్వేషం ఉండకూడదని, కానీ జగన్ మూడేళ్ళ పాలనలో విధ్వంసం మాత్రమే ఉందని మండిపడ్డారు. ఎవరైనా సమస్యలపై గళమెత్తినా, ఇది తప్పు అని చెప్పినా వారిని చంపటమే ధ్యేయంగా పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకో 18 నెలల సమయం ఉందని, ప్రజా వ్యతిరేకత పెరిగితే ఇంకా ముందే ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని, అప్పుడు ఈ రాష్ట్రానికి పీడా విరగడ అవుతుందని వ్యాఖ్యానించారు. విభజన కంటే సిఎం జగన్ పాలనలోనే రాష్ట్రం ఎక్కువ నష్టపోయిందని మరోసారి చెప్పారు. ప్రజలు కుంపటి నెత్తిన పెట్టుకున్నట్లు ఉన్నారని, ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ఈ కుంపటిని విసిరేసేందుకు తయారుగా ఉన్నారని చెప్పారు. టిడిపి కార్యకర్తలంతా విరామం లేకుండా పోరాటం చేయాలని పిలుపు ఇచ్చారు. ఈ నెలనుంచే పార్టీ నేతలంతా ప్రజల్లో ఉండాలని, ప్రతి నెలా పది రోజులపాటు ఇన్ ఛార్జ్ లు కచ్చితంగా నియోజకవర్గంలోనే ఉండాలని సూచించారు.
ఈసారి ఎన్నికల్లో విజయం సాధించే వారికే టికెట్ ఇస్తామని, గతంలో కొన్నిసార్లు తప్పిదాలు జరిగాయని, అలాంటివి పునరావృతం కానివ్వబోమని స్పష్టం చేశారు.
Also Read : ఇప్పుడే ఏమీ చెప్పలేను: చంద్రబాబు