25.7 C
New York
Thursday, October 5, 2023

Buy now

HomeTrending NewsYSRCP: ఐటి నోటీసులపై బాబు సమాధానం చెప్పాలి: పేర్ని

YSRCP: ఐటి నోటీసులపై బాబు సమాధానం చెప్పాలి: పేర్ని

ఐటి నోటీసుల ద్వారా చంద్రబాబు గుట్టు రట్టయ్యిందని, ప్రజల ఆస్తిని ఆయన ఎలా కొట్టేశాడో బహిర్గతమైందని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. గత ఏడాది సెప్టెంబర్ 29న ఐటి ఈ నోటీసులు ఇచ్చిందని, కానీ ఇప్పటివరకూ ఈ భాగోతం బైటకు రానీయలేదని అన్నారు. ఎల్ అండ్ టి, షాపూర్ జీ పల్లోంజీ కంపెనీల ద్వారా వాటి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని ద్వారా , తన పిఏ శ్రీనివాస్ కు ఈ ముడుపులు అందాయని స్పష్టంగా వెల్లడయ్యిందన్నారు. తనకు నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టి , తాత్కాలిక రాజధాని పేరిట బాబు దోపిడీ చేశారని ఆరోపించారు. హిందూస్థాన్ టైమ్స్ ఈ వార్తను నేడు ప్రచురించిందని, ఇవే కాక ఇంకా ఎన్నో రూపాల్లో అవినీతి జరిగిందని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నాని మీడియాతో మాట్లాడారు.

జగన్ తన ఇంట్లో భార్య, తల్లితో ఏం మాట్లాడారో.. సిఎం ఢిల్లీ వెళ్తే ప్రధానితో ఏమి మాట్లాడారో కూడా రాసే కొన్ని పత్రికలు బాబుకు ఇచ్చిన నోటీసులపై ఎందుకు వార్తలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నాడు ఎన్టీఆర్ కు చేసిన ద్రోహం బాబును ఇప్పటికీ వెంటాడుతోందని, 1995 సెప్టెంబర్ 1 న నాడు ఎన్టీఆర్ ను కూలదోశారని, నేడు అదే తేదీన ఈ గుట్టు బైటపడిందని పేర్కొన్నారు.

నోటీసులు అందిన మాట నిజమా కాదా అనేది చంద్రబాబు సమాధానం ఇవ్వాలని, ప్రతి దానికీ మైకు పెట్టుకొని మాట్లాడే బాబు హిందూస్థాన్ టైమ్స్ కథనంపై ఎందుకు మాట్లాడరని నిలదీశారు. గత ఏడాది నోటీసులు వస్తే ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. చైతన్య రథం పత్రికలో అన్నీ రాసే టిడిపి దీనిపై ఎందుకు రాయలేదన్నారు. పోతుల సునీత తమ కుటుంబంపై ఆరోపణలు చేసిందని పరువునష్టం దావా వేసిన లోకేష్ ఇప్పుడు ఈ పత్రికపై కూడా దావా వేయాలని సవాల్ చేశారు. ఓ చేనేత కుటుంబం నుంచి వచ్చిన పోతుల సునీతపై నానా రకాలుగా వ్యాఖ్యలు చేసిన లోకేష్ ఇప్పుడేమి చేస్తారని… 2010 నుంచి ప్రతియేటా సెప్టెంబర్ 1 లేదా 2 న తన ఆస్తులు ప్రకటించే చంద్రబాబు ఈ దాచిపెట్టిన ఆదాయం గురించి ఎందుకు చెప్పలేదని నాని సూటిగా అడిగారు. ఈ ప్రపంచంలో సిగ్గు, అభిమానం, ఆత్మాభిమానం ఈషన్మాత్రం కూడా లేని ఏకైక రాజకీయ నేత చంద్రబాబేనని ధ్వజమెత్తారు. ఎవరితో అవసరం ఉంటే వారి కాళ్ళు పట్టుకోవడం అవసరం తీరిపోయిన తరువాత చెత్త బుట్టలో వేయడం బాబు నైజమని, అది నాయకులైనా, ప్రజలైనా ఆ తీరు మారదని ఎద్దేవా చేశారు.

NewsDesk
NewsDesk
'ఐ'ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

న్యూస్