ఎన్నిసార్లు హెచ్చరించినా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మారడంలేదని, చట్టాన్ని  అతిక్రమించి పని చేసే ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు. కొంతమంది కళంకిత అధికారులు తయారై మొత్తం పోలీసు శాఖకే మచ్చ తెస్తున్నారని, తమ  పార్టీ  కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేదిలేదని, చట్టాన్ని ఉల్లంఘిస్తే అధికారులకైనా శిక్ష తప్పదని స్పష్టం చేశారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర న్యాయవిభాగం పదవీ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది, బాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

టిడిపి సోషల్ మీడియా కోర్దినేటర్ నరేంద్ర ఏ తప్పు చేశారని అరెస్టు చేశారని, ప్రవీణ్ కుమార్ రెడ్డి, టిటిడి కార్యకర్తలను కూడా ఎందుకు అదుపులోకి తీసుకున్నారో  చెప్పాలని బాబు ప్రశ్నించారు. తమ పార్టీ నేతలపై దాడులు చేస్తారని  పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినా వారు అడ్డుకోలేక పోతున్నారని, ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేసే వారిని కోర్టుకీడుస్తామని… ప్రజలనుంచి జీతం తీసుకుంటూ పోలీసులు అధికార పార్టీకి ఊడిగం  చేయడం హేయమని పేర్కొన్నారు. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, పిరికితనం ఎప్పుడూ లేదని… ఈ ప్రభుత్వ బెదిరింపులకు, అక్రమ అరెస్టులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు.

ప్రతిపక్షంలో ఉండగా అమరావతి రాజధానికి ఒప్పుకొని అధికారంలోకి రాగానే జగన్ మాట మార్చారని చంద్రబాబు విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఈ రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేస్తున్నారని, పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలియదని, విశాఖ నగరాన్ని విధ్వంసం చేశారని, రిషికొండను బోడిగుండు చేశారని మండిపడ్డారు.  రాష్ట్రంలో పాలన రివర్స్ గేర్ లో నడుస్తోందన్నారు.

రాష్ట్రంలో టిడిపి కార్యకర్తలకు న్యాయ సహాయం అందించడంలో లీగల్ సెల్ క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని బాబు కితాబిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి సాయపడిన వారికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.

Also Read : సిఐడి తీరు దారుణం: చంద్రబాబు ఆగ్రహం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *