Tuesday, September 17, 2024
HomeTrending Newsనాయకుల కాళ్ళకు దండాలు వద్దు: బాబు

నాయకుల కాళ్ళకు దండాలు వద్దు: బాబు

కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని వీడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఇకపై ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే తాను తిరిగి వారి కాళ్ళకు దండం పెడతానని వ్యాఖ్యానించారు. నేటి నుంచి ఈ తరహా దండం పెట్టే విధానానికి చరమగీతం పాడుతున్నట్లు వెల్లడించారు.

ఈ ఉదయం చంద్రబాబు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఆయన్ను కలిసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు. వారిలో చాలా మంది బాబుకు వివిధ అంశాలపై వినతి పత్రాలు ఇచ్చారు, మరికొందరు వినతిపత్రం ఇవ్వగానే పాద నమస్కారం చేశారు. ఆ తర్వాత మాట్లాడిన బాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘తల్లిదండ్రులు, భగవంతుడికి తప్ప నాయకుల కాళ్లకు దండం పెట్టకూడదు’ అంటూ వారినుద్దేశించి అన్నారు.

ఆ తరువాత కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో అనంతశేష స్థాపన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షులు మధుపండిత్, మంత్రులు నారాయణ, సబిత; ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయలు తదితరులు పాల్గొన్నారు.
నాడు అలిపిరి ఘటనలో తనకు ప్రాణ భిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామి అని, ప్రతి రోజు వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుని, తెలుగు జాతికి సేవ చేయటానికి, పేదరికం లేకుండా చేయటానికి, తనకు శక్తి సామర్ధ్యాలు ఇవ్వమని కోరుకుంటానని తెలిపారు. పేదరికంలో ఉన్న వారికి చేయూత ఇవ్వడం మనందరి బాధ్యత అని అభిలషించారు.
“పెనుగొండలో 108 అడుగుల ఏక రాతి విగ్రహంతో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నిర్మాణానికి నాడు ఇస్కాన్ ముందుకు వస్తే, తరువాత వచ్చిన ప్రభుత్వం, దాన్ని కూడా రద్దు చేసింది. మంచి కార్యక్రమాలని అడ్డుకోవటమే, గత ఐదేళ్ళలో జరిగింది. ఇక అలాంటి పరిస్థితి నేడు ఆంధ్రప్రదేశ్ లో లేదు, రాష్ట్రానికి అందరినీ స్వాగతం పలుకుతున్నా,  మంచి చేయాలనుకునేవారికి ఇక స్పీడ్ బ్రేకర్లు, విధ్వంసం అనేది ఉండదు, మంచి చేసే వారందరికీ ఆంధ్రప్రదేశ్ ఇక చిరునామాగా ఉంటుంది” అని బాబు స్పష్టం చేశారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్