ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ఘన విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. కాగా రేపు ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల ఎన్డీఏ కూటమి నేతల భేటీ జరగనుంది. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చంద్రబాబుకు ఫోన్ చేసి రేపటి సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబును ఎన్నుకునే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల నుంచి తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ఘనవిజయం సాధించినా కేంద్రంలో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడంతో దేశవ్యాప్తంగా ఉన్న చిన్నాచితక పార్టీలను సమన్వయం చేసి వాటిని ఎన్డీఏ వైపు మళ్ళించేలా చంద్రబాబు అనుభవం ఉపయోగపడుతుందని మోడీ, అమిత్ షా భావిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రాత్రికి తెలుగుదేశం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. మంత్రివర్గంలో జనసేన చేరికతో పాటు ఎన్ని క్యాబినెట్ బెర్త్ లు, ఇతరత్రా పదవుల పంపకంపై ఈ సమావేశంలో ఇరువురు నేతలు నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని టిడిపి వర్గాలు వెల్లడించాయి.
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో విజయోత్సవాలు జరిగాయి. నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. మనవడు నారా దేవాన్ష్ చంద్రబాబుకు కేక్ తినిపించి అభినందనలు అందించారు. టిడిపి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ సిద్ధార్థ సింగ్ నాథ్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.