Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

B(o)ald Demands: పద్యం:- 
“ధర ఖర్వాటుడొకండు సూర్య కర సంతప్త ప్రధానాంగుడైత్వర తోడన్ బరువెత్తి చేరి నిలచెన్ తాళ ద్రుమచ్ఛాయ తచ్ఛిరమున్ తత్ఫల పాత వేగమున విచ్చెన్ శబ్ద యోగంబుగాబొరి దైవోపహతుండు వోవు కడకుం పోవుంగదా యాపదల్!”

అర్థం:-
ఒక తళతళలాడే బట్టతల వాడు నెత్తిమీద ఎండ వేడికి మాడి మసై పోతున్నాడు. కాళ్లకింద కూడా వేడి. ఎటు చూసినా ఎడారి. దూరంగా ఒక తాటి చెట్టు కనిపించింది. త్వర త్వరగా పరుగెత్తి…చెట్టుకు అనుకుని కొద్దిపాటి నీడలో నిలుచున్నాడు. ఆ చిన్న కుదుపుకు పండిన తాటికాయ సరిగ్గా అతడి నెత్తిన పడి…తల టప్ మన్న శబ్దంతో రెండుగా చీలిపోయింది. దైవం చిన్న చూపు చూసిన వారి వెంట ఆపదలు వేటకుక్కలా వెంటపడి వేధిస్తాయి.

ఇదివరకు హై స్కూలు తెలుగు పాఠాల నీతి పద్యాల్లో తప్పనిసరిగా ఉండే పద్యమిది. ఇప్పుడు స్కూలు పిల్లలకే ఆ బట్ట తలలు వచ్చి…చిన్నవయసుకే తలలు పండి ముగ్గు బుట్టలవుతున్నాయి కాబట్టి…ఈ దైవోపహతమయిన బట్టతల పద్యం చదవదగ్గ పాఠంగా ఉందో? లేదో? తెలియదు.

ఆకారం- వికారం అన్నవి రూఢిని బట్టి స్థిరపడతాయి. అందరికీ నెత్తిన జుట్టు ఉండడం సహజం. అలా నెత్తిన జుట్టు ఉన్నవారి ఆకారం బాగున్నట్లు…జుట్టు లేనివారు వికారంగా ఉన్నట్లు…ఒక అలిఖిత ప్రమాణం స్థిరపడిపోయింది. దాంతో జుట్టులేనివారిని, బట్టతలవారిని సమాజం అనాదిగా చిన్నచూపు చూస్తోంది. ఎగతాళి చేస్తోంది. అదోలా చూస్తోంది.
ఈ అవమానాలను భరించలేక కొన్ని బట్టతలలు తమ నున్నని రన్ వే మీద కొత్తగా వెంట్రుకలను పొడిపించుకుంటున్నాయి. కొన్ని బట్టతలలు తమ సువిశాల క్రికెట్ గ్రవుండ్ మీద హెయిర్ గ్రాఫ్టింగ్ చేయించుకుంటున్నాయి. పుడమి పొలంలో దుక్కి దున్ని…ఎరువులు చల్లి…నారుపోసి…నీరుపోసి…పైరు పెట్టడంలా…  నిగనిగలాడే ఎడారి తలను దున్ని…చిల్లులు పెట్టి…నూనెలు చల్లి…ఒక్కో వెంట్రుక నారు నాటి…నీరు పోసి…పెంచి పెద్ద చేసి…నాటిన వెంట్రుక ఊడిపోకుండా నిలబెట్టడం రాకెట్ సైన్స్ కంటే సంక్లిష్టమయినది.

అందం ఒక ఆకర్షణ. 
అందం ఒక వల. 
అందం ఒక వ్యామోహం.
 అందం ఒక ఆత్మవిశ్వాసం. 
అందం ఒక తప్పనిసరి. 
అందం ఒక వ్యాపారం.
 అందం ఒక వ్యసనం.
 అందం ఒక శాంతి.
 అందం ఒక భ్రాంతి.

అలాంటి అందానికి నెత్తిన జుట్టే కీలకం కాబట్టి…బట్టతల కనిపించకుండా విగ్గయినా పెట్టుకోవాలి. లేదంటే వేలు, లక్షలు ఖర్చు పెట్టి అత్యాధునిక హెయిర్ గ్రాఫ్టింగ్ ట్రాన్స్ ప్లాంటేషన్ అయినా చేయించుకోవాలి.

బట్టతల మాయమై నెత్తిన ఒత్తుగా జుట్టు రాగానే సహజంగా ఎవరికయినా పులకింతలు మోసులెత్తుతాయి. పదే పదే అద్దంలో మొహం చూసుకోవాలనిపిస్తూ ఉంటుంది. పూట పూటకు వయసు పదేళ్లు వెనక్కు వెళుతున్నట్లు అలౌకిక కేశ పారమార్థిక ఆనంద స్థితిలో ఓలలాడుతూ ఉంటారు.

“ఊరుకున్నంత ఉత్తమం లేదు;
బోడి గుండంత సుఖం లేదు”
అన్న సామెతను కొందరు ట్రూ స్పిరిట్లో తీసుకుని…బట్టతల సమస్యకు శాశ్వత గుండుతో పరిష్కారం కనుక్కున్నారు. వీరిది శాశ్వత నిజ వైరాగ్య ఆమోదయోగ్య ప్రాక్టికల్ సిద్ధాంతం.

వెంట్రుకతో సమానమయిన వెంట్రుకల మీద వ్యామోహం ఉండకూడదనే పుణ్యక్షేత్రాల్లో తల నీలాలు భక్తి భావనతో సమర్పణ చేస్తూ ఉంటాం. అహంకారానికి తల, తలలోని ఆలోచనలు కారణం. అలాంటి తల నరికి దేవుడి కాళ్లమీద పెట్టాలి. తల నరుక్కుంటే బతికి ఉండము కాబట్టి…తలమీద వెంట్రుకలను నరకడం ప్రతీకాత్మకం. ఇంతకంటే ఇంకా లోతయిన తాత్వికత కూడా గుండు కొట్టించుకోవడంలో ఉంది కానీ…ఆ విషయాలు ఇక్కడ అనవసరం. గుండును గుండు అంటే బాధ. ఎగతాళి. అవమానించడం. ఆట పట్టించడం.

తెలుగు సాహిత్యం లోతులు తెలిసిన హాస్య నటుడి ఇంటిపేరు మారి “గుండు” సుదర్శన్ అయినా…ఆయన దాన్ని పాజిటివ్ గా తీసుకుని వెళ్లిన చోటల్లా హ్యాట్స్ ఆఫ్ అని ఆయనకు ఆయనే టోపీ తీసి తన శాశ్వత గుండు పుట్టు పూర్వోత్తరాలను హాస్యరసభరితంగా వివరిస్తూ ఉంటారు.
గుండె జారినా పరవాలేదు కానీ…వెంట్రుకలు రాలుతుంటే మనసు మనసులో ఉండదు. మెదడు చల్లబడి…కొయ్యబారినా పరవాలేదు కానీ…జుట్టు తెల్లబడకూడదు. వయసు ఎనభై దాటి ఏ అవయవమూ స్పందించకపోయినా పరవాలేదు కానీ…నెత్తిన జుట్టు రంగు నలుపు తగ్గకూడదు.

ఇందులో న్యాయం, ధర్మం, అందం- వికారాల స్పృహ, మోసం, ఆత్మన్యూనత లాంటి విషయాల చర్చలో ఎవరి వాదన వారిది.

నెత్తిన ఒత్తయిన జుట్టున్న కరకు మనసు హంతకుడినయినా భరిస్తుంది కానీ…
మెత్తటి మనసున్న నెత్తిన జుట్టులేని మంచి మనిషిని మాత్రం భరించనే భరించదు పాడు లోకం!

దేశంలో తొలిసారి బట్టతలల బాధితుల సంఘం తెలంగాణాలో ఏర్పడింది. సమాజంలో తాము ఎదుర్కొంటున్న అవమానాల మీద సంఘం తొలి సమావేశం విస్తృతంగా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను పెట్టింది. కొన్ని హెచ్చరికలు చేసింది.

1. రాష్ట్రంలో బట్టతలలను లెక్కించి ఒక్కో తలకు నెలకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి.
2. బట్టతలలవారిని మానసిక వికలాంగులుగా గుర్తించాలి(బహుశా ఒక వైకల్యంగా గుర్తించాలి అనబోయి అలా అన్నారో, లేక వారు సరిగ్గానే అన్నా…రాసిన జర్నలిస్ట్ తప్పుగా రాశారో స్పష్టత లేదు!)
3. ప్రస్తుత సంక్రాతి లోపే బట్టతలలకు పెన్షన్ ఇవ్వకపోతే…ప్రగతి భవన్ ను ముట్టడించి…నిరసన తెలుపుతాము.

రోజూ కలిసే నా మిత్రుడు ఒకాయన మూడు వారాలు కనిపించకపోతే కంగారు పడి వాళ్ల ఇంటికెళ్లాను. ఇల్లంతా దిగులు దిగులుగా గంభీరంగా ఉంది. హతవిధీ! ఏదో జరిగిందనుకుని…ఏమక్కా! మీ ఆయన…అని ఏమి మాట్లాడాలో తెలియక…నీళ్లు నమిలాను. ఇంకొక వారం దాకా ఎవ్వరికీ కనపడడన్నా అని బరువెక్కిన గుండెతో లోగొంతుకతో చెప్పింది. ఏమయ్యింది? ఏ ఆసుపత్రిలో ఉన్నాడు? అంటే…పూసగుచ్చినట్లు…గుండె బరువు దించుకున్నట్లు మొత్తం కథ చెప్పింది. బట్టతల బాధ భరించలేక మా మిత్రుడు లక్షలు ఖర్చు పెట్టి కొన్ని వెంట్రుకలను నెత్తిమీద యంత్రాలతో నాటించుకున్నాడు. కొన్ని రోజులు ఏవో నూనెలు అవీ పూస్తూ…నాటిన ఒక్క వెంట్రుక కూడా ఊడి పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలట. దాంతో వెంట్రుకల ఏరువాక ఫ్యాక్టరీ వారే ఇచ్చిన ఒకరకమయిన బట్ట టోపీ పెట్టుకుని ఖాళీగా ఉన్న బంధువుల ఇంట్లో ఏకాంతంగా ఉన్నాడు. ఎండ పడకూడదట. వర్షంలో తడవకూడదట. బహుశా కొత్తగా మొలిపించుకున్న వెంట్రుకలతో అతని అందం, ఆత్మ విశ్వాసం పెరిగి వారి సంసారం అజ్ఞాతవాస ఏకాంతాల నైరాశ్యాలు పోయి...సంతస వసంతాల వనాల పూల పవనాల వీర విహారాల బాటలో ఒత్తయిన జుట్టు పాటలు పాడుకుంటూ ఉండి ఉండాలి.

ఇలా లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి నెత్తిన కృత్రిమంగా జుట్టు నాటించుకునే కేశ సౌభాగ్యం ఎందరికుంటుంది?
కాబట్టి ప్రభుత్వాలు బుర్ర గోక్కుని అయినా…తలదించుకున్న నిగనిగలాడే నున్నని బట్ట తలలను తల ఎత్తుకునేలా చేయాల్సిన అవసరం ఎంతయినా ఉన్నది!

బట్టతలలు బతికి బట్ట కట్టుకుని బలుసాకయినా తినడానికి వీలుగా నెలకు ఆరు వేలు ఇవ్వాల్సిందే!

ఇదొక జాతీయ స్థూల బట్టతలోల్బణ సమస్య. రాలిన వెంట్రుకలతో పాటు వాలిన మొహాల సగటు అవమాన భార సూచి. జుట్టు పట్టుకుని నిలదీయలేని ఒకానొక కేశ బాధ.

కట్టెదుట మనిషికి బట్టతలే శిక్ష!
తెట్టెలాయె మహిమల దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష!!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com