కుప్పంలో జరిగిన సంఘటన వైసీపీ ప్రభుత్వ అరాచకానికి పరాకాష్ట అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.  కుప్పంలో తన పర్యటన సందర్భంగా ప్రభుత్వం చేసిన అరాచకాలపై సంఘీభావం తెలియజేయడానికే పవన్ నేడు వచ్చారని అంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని, కానీ విపక్షాలకు ఆ అవకాశమే ఇవ్వడం లేదని, పైగా ఎదురు కేసులు పెడుతున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు.  విశాఖలో పవన్ వెళ్ళినప్పుడు కూడా అలాగే చేశారని, ఇప్పటంలో పవన్ మీటింగ్ కు స్థలం ఇచ్చారనే కక్షతో వారి ఇళ్ళు కూడా కూల్చి వేశారని గుర్తు చేశారు.

ఏడుసార్లు కుప్పం నుంచి గెలిచానని, తన నియోజకవర్గంలో పర్యటించకుండా చూసేందుకు రెండు వేల మంది పోలీసులను పెట్టి గొడవలు చేసి అడ్డుకోవాలని చూశారని చంద్రబాబు విమర్శించారు. మహిళలు తమపై హత్యాయత్నం చేశారని పోలీసులు కేసులు పెట్టె స్థాయికి వ్యవస్థలు దిగాజారాయని అన్నారు.  కందుకూరు, గుంటూరులలో జరిగిన సంఘటనలు వైసీపీ ప్రభుత్వం, పోలీసులు చేసిన కుట్రగా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కుట్ర వైసీపీది అయితే, అమలు చేసింది పోలీసులని ఆరోపించారు.  జీవో నంబర్ 1 పై అన్ని రకాలుగా పోరాటం చేస్తామని, వెనక్కు తీసుకునే వరకూ పోరాడతామని ప్రకటించారు. ఇప్పటికే ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక కూడా ఏర్పాటు చేశామని, ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై ఓ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.

కుప్పంలో జరిగిన ఘటనలు, ప్రతిపక్ష నేతగా అయన హక్కులను కాలరాసిన పరిస్థితి చూసి చంద్రబాబు గారిని కలిసి సంఘీభావం తెలిపేందుకు వచ్చానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రభుత్వ చర్యలను సంయుక్తంగా ఎలా ఎదుర్కోవాలనే దానిపై చర్చించామని తెలిపారు. రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిపోయిందని, అరాచక పాలన నడుస్తోందని, ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. జీవో నంబర్ 1 పేరుతో బ్రిటిష్ కాలంనాటి చీకటి చట్టాన్ని తీసుకు వచ్చారని అన్నారు.  గతంలో ఫ్లెక్సీలు నిషేధిస్తున్నట్లు చెప్పారని… కానీ సిఎం పుట్టినరోజుకు ఆఖరుకు ఆంధ్రా యూనివర్సిటీలో సైతం ఫ్లేక్సీలు వేశారని… అలాగే జీవో నంబర్ వన్ అనేది అందరికీ వర్తిస్తుందని చెప్పినా వారికి ఆ రూల్ పాటించరని పవన్ ఎద్దేవా చేశారు. మా సభలకు మేమే లాఠీలు పట్టుకొని నిల్చుంటే ఇంకా పోలీసులు, ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు.

రైతు సమస్యలు… పెన్షన్ తొలగింపు పై కూడా మాట్లాడుకున్నామని తెలిపారు. వైసీపీకి ఇప్పటికే ఓటమి భయం పట్టుకుందని, ఇకముందు ఇంకా అరాచకాలు చేస్తారని పవన్ అనుమానం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *