శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్‌ ముదిరాజ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ప్రకటించారు. బండ ప్రకాశ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. సాదరంగా ఆహ్వానించి చైర్‌లో కూర్చోబెట్టారు. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. మండలి డిప్యూటీ చైర్మన్‌గా బండ ప్రకాశ్‌ ఏకగ్రీవంగా ఎన్నికవడం తమకెంతో ఆనందదాయకమని చెప్పారు. మంచి విద్యాధికులుగా పేరు తెచ్చుకున్నారని వెల్లడించారు. విద్యార్థిగా ఉంటూనే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారని తెలిపారు. కౌన్సిల్‌ డిప్యూటీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టడం గర్వకారణమన్నారు. ఆయన సేవలు తెలంగాణ ప్రజానీకానికి ఎంతో అవసరమని చెప్పారు. డిప్యూటీ చైర్మన్‌గా సభలో ఫలవంతమైన చర్చలకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాని తెలిపారు.

శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన బండా ప్రకాశ్‌ను రాష్ట్ర మంత్రులు అభినందించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ తో పాటు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి శాసన మండలిలో బండా ప్రకాశ్‌ను కలిసి శాలువాతో సన్మానించారు. పుష్పగుచ్చాలను అందజేసి అభినందించారు .

మంత్రి తలసాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీసీలంటే అమితమైన ప్రేమ అని అన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో బీసీలకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారని, రాజకీయ పదవులలోనూ వారికే అగ్రతాంబూలం ఇస్తున్నారన్నారని పేర్కొన్నారు. అందుకు నిదర్శనం బీసీ నేతకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవి కట్టబెట్టడం అన్నారు.

మండలి డిప్యూటీ చైర్మెన్‌గా ఎన్నికైన బండ ప్రకాశ్‌ను మంత్రి కేటీఆర్‌ హృదయపూర్వకంగా అభినందించారు. ఆయన అనుభవం సభకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాన్నారు. కాగా, బండ ప్రకాశ్‌కు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *