ఇంగ్లాండ్ తో జరుగుతోన్న టి20 సిరీస్ ను బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసింది. వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి ఇప్పటికే సిరీస్ ను గెల్చుకున్న ఆతిథ్య జట్టు మూడో మ్యాచ్ లో కూడా 16 పరుగులతో విజయం సాధించింది.
ధాకా లోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లా ఓపెనర్ లిట్టన్ దాస్ 57 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్ తో 73; నజ్ముల్ శాంటో-47; రోనీ తాలుక్దార్-24 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ చెరో వికెట్ పడగొట్టారు.
ఇంగ్లాండ్ 5 పరుగుల వద్ద తొలి వికెట్ (ఫిలిప్ సాల్ట్ డకౌట్) కోల్పోయింది. డేవిడ్ మలాన్- కెప్టెన్ జోస్ బట్లర్ లు రెండో వికెట్ కు 95 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. రెండు వరుస బంతుల్లో వీరిద్దరూ (మలాన్-53; బట్లర్-40) ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చిన వారు బంగ్లా బౌలర్లను ధీటుగా ఎదుర్కోలేకపోయారు. 20 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 142 పరుగులే చేయగలిగారు.
బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, తన్వీర్ ఇస్లామ్, షకీబ్ అల్ హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
లిట్టన్ దాస్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’…. నజ్ముల్ హోస్సేన్ శాంటో కు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ లభించాయి.