Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపరిహాసానికి కూడా పరిమితి ఉండాలి

పరిహాసానికి కూడా పరిమితి ఉండాలి

Bank Security Guard Opens Fire On Employee : Friendship Doesn’t Mean Anything

మహాభారతంలో మయసభలో తత్తర బిత్తర పడ్డ దుర్యోధనుడిని చూసి ద్రౌపది నవ్వడమే కురుక్షేత్రానికి దారితీసిందని కొందరంటారు. కింద పడినందుకుకాదు, తోడికోడలు నవ్వినందుకు ఏడుపొచ్చిందనే సామెతా విన్నదే. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? మితి మీరిన పరిహాసం పనికి రాదనే కదా!

ఈ మధ్య ఇద్దరు స్నేహితుల గొడవ జంట నగరాలు ఉలిక్కి పడేలా చేసింది. బ్యాంకులో పనిచేసే ఇద్దరు స్నేహితుల పరిహాసం చివరకు కాల్పులకు దారి తీసింది. కారణం వారిలో ఒకరు మరొకరిని తరచు గేలిచేయడం. ఏదో ఒకటి అనడం. భరించలేక క్షణికావేశంలో చేతిలో ఉన్న తుపాకీతో కాల్చేశాడు.

ఇలా స్నేహితుల మధ్య చిన్న తగాదాలే ప్రాణం మీదికి తెచ్చే సంఘటనలు తక్కువేం కాదు.ఏదయినా సరే లిమిట్ దాటితే ప్రమాదమే. ముఖ్యంగా కొన్ని బంధాల్లో. స్నేహం, ప్రేమ వంటి అంశాల్లో మరింత జాగ్రత్త అవసరం. ఎందుకంటే చాలామంది స్నేహానికి పరిమితులుండవనుకుంటారు. ఫ్రెండే కదా ఏమన్నా పర్వాలేదనుకుంటారు.

రామాయణ భారతాలు ఎన్నో పాఠాలు అందించాయి. స్నేహం చేసిన పాపానికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు కర్ణుడు. స్నేహం ఉందికదా అని పరిమితులు దాటకుండా అవసరమైన సాయం చేశాడు సుగ్రీవుడు. ఇది చాలు స్నేహం ఎలా ఉండాలో తెలియడానికి.

స్నేహమేరా జీవితమన్నా, అంతకన్నా మిన్న లోకాన లేదన్నా సినిమాల్లో చూడటానికి బాగుంటుంది. వాస్తవంలో అన్ని స్నేహాలూ అలా ఉండవు. కొంతమంది పక్కన ఉంటే ఆహ్లాదంగా ఉంటుంది. వారి మాటలకు మనసు తేలికవుతుంది. మరికొంతమంది తేలిక మాటలకు మనసు చిన్నబుచ్చుకుంటుంది. అటువంటివారికి దూరంగా జరిగిపోవాలి. నచ్చకపోయినా, పదే పదే మనకు అడ్డు తగులుతున్నా స్నేహమే అనుకుంటూ కూర్చుంటే మనకే నష్టం. కొన్నిచోట్ల మొహమాటం పనికి రాదు. మనకు నచ్చంది చెప్పాలి. లేదా దూరం జరగాలి. అంతేకానీ అస్తమానూ మన వ్యక్తిగతం లోకి తొంగిచూస్తూ పదిమందికీ ఆ విషయం చెప్పే స్నేహితులు లేకపోతేనే మేలు.

మంచి స్నేహం ఎలాఉంటుందంటే
⁃ రెండుపక్కల నిజాయతీ ఉంటుంది
⁃ వేర్వేరు లక్ష్యాలున్నా స్నేహితుల అభిప్రాయం గౌరవిస్తారు
⁃ స్నేహం విలువ తెలిసినవారిగా అవతలివారు ఒక్కోసారి స్పందించకున్నా అర్థం చేసుకుంటారు
⁃ ఇంకా నిపుణులు పేర్కొనే లక్షణాలలో నమ్మకం, నిర్భయత్వం, సమానత్వం, గౌరవం, ఆసరా, నిజాయతీ, అనుకున్నది చెప్పగలగడం మంచి స్నేహంలో కనిపించే లక్షణాలు. స్నేహం అప్పటికప్పుడు చేస్తారుగానీ గుణగణాలు చూసి చేస్తారా అనుకోవచ్చు. కానీ కొన్నాళ్ల తర్వాతయినా పై లక్షణాలు ఉంటేనే ఆ బంధం నిలబడుతుంది.

-కె. శోభ

Read More: రంగు రాళ్లు-మోసగాళ్లు

Read More: మంచింగ్ మాఫియా

RELATED ARTICLES

Most Popular

న్యూస్