Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ఇంటిపనుల్లో అందరూ తలా ఒక చేయి వేయాలి

Q.  కొంత కాలంగా నేను పడుతున్న బాధని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. మాది ముచ్చటైన కుటుంబమే. ఇద్దరు పిల్లలు, అత్తమామలు ..మొత్తం ఆరుగురం. మా అబ్బాయి హాస్టల్ లో ఉండేవాడు. అత్తమామలు దగ్గర్లోనే విడిగా ఉండేవారు. మా వారిది సాఫ్ట్ వేర్ ఉద్యోగం. అమ్మాయి పదోతరగతి. అందరూ బిజీనే. పొద్దున్న తొమ్మిదికల్లా పని పూర్తిచేసి కాసేపు రిలాక్స్ అయ్యేదాన్ని. జిమ్, కిట్టి పార్టీలు,స్నేహితులకు సమయం ఉండేది. మా అత్తమామల ఇంటికి వెళ్లి కాసేపు ఉండి వారికి కావలసిన పనులు చేసేదాన్ని. మరి ఇప్పుడో?..లాక్ డౌన్ మొదలయ్యాక అందరం ఒక్కచోటే. మా అత్తమామలను కూడా మా ఇంటికే తీసుకువచ్చారు మా వారు. పోనిలే అనుకున్నా. ఓ పక్క పనివారి సహాయం లేదు. పిల్లలేమో ఆన్లైన్ చదువులతో, శ్రీవారు ఆఫీస్ పనితో బిజీ.

అందరికీ వేర్వేరు రుచులు కావాలి. ఎక్కడా తేడా రాకూడదు. పెద్దవాళ్ళు ఏ సహాయం చెయ్యలేరు. వారి ఆహారనియమాల ప్రకారం చేసిపెట్టాలి. ఓ పక్క ఇంటిపనులు,మరోవైపు వంట పనులతో శారీరకంగా మానసికంగా బలహీనపడ్డాను. దాంతో కోపం పెరిగిపోతోంది. ఇంట్లో అందరిమీదా అరుస్తున్నాను. నాకు కోపం వచ్చినప్పుడు ఇంటిపనుల్లో కొద్దిగా సహాయం చేస్తారు. మళ్ళీ మాములే. చిన్న చిన్న పనులకు కూడా పదిసార్లు చెప్పాలి. వాళ్ళకి పని లేకపోతే టీవీ, సినిమాలు చూస్తూ రిలాక్స్ అవుతారు. నాకు ఏదీ లేదు. పారిపోవాలనిపిస్తోంది…బందీనై పోయాననిపిస్తోంది. ఎవరికి చెప్పాలన్నా అన్నిచోట్లా ఇదే పరిస్థితి. ఎలా ఎదుర్కోవాలి?
-శాంతి

A. కరోనా వ్యాధి, తదనంతర లాక్ డౌన్ పరిణామాలతో ఎన్నో కుటుంబాల్లో విపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా గృహ హింస 40 శాతం వరకు పెరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పేదా గొప్పా తేడాలేదు. చదువుకున్నా లేకపోయినా ఒకటే. వీటన్నిటికీ కారణం మన పెంపకాల్లో తరతరాలుగా నూరిపోసిన వివక్ష.

ఇంటిపని గృహిణిది మాత్రమేననే ధోరణి. ఇటువంటి ఉత్పాతాలు మన సమాజ ధోరణిని ప్రశ్నించి మారాల్సిన అవసరం గుర్తు చేస్తాయి. ఈ విషయంలో జపాన్ దేశం అందరికీ ఆదర్శం కావాలి. అక్కడ స్కూళ్లలో చదువుతో పాటు జీవితానికి అవసరమైన పనులు చేసుకోవడం కూడా నేర్పిస్తారు(వంటలు సహా)మనదగ్గర రుబ్బుడు చదువులే తప్ప ఇటు పుల్ల తీసి అటు పెట్టరు. ఇంట్లో కూడా అదో పెద్ద విషయంగా భావించరు. పిల్లలు కూడా ఇంట్లో పని చెప్తే చెయ్యరు. అదే స్కూల్ లో టీచర్ చెప్తే వెంటనే చేస్తారు.

ఉద్యోగం చేసే మహిళల పరిస్థితి ఇంకా దారుణం. ఇంట్లో ఆఫీస్ పని, ఇంటిపని కూడా చేయాలి. అందరికీ కాకపోయినా ఎక్కువమందికి ఇవే సమస్యలు. అలాగని మీరు నిరుత్సాహ పడకండి. అడిగినప్పుడైనా సహాయం చేస్తున్నారంటే సహాయపడే గుణం ఉందన్నమాట. ముందుగా మీరు ఒక కుటుంబ సమావేశం పెట్టండి. మీ కష్టం వివరించండి. ఎవరెవరు ఏం సహాయం చేయగలరో అడగండి. అలాగే వంటలు తదితరాల్లో కూడా. వారి వారి ఆసక్తిని బట్టి పనులు కేటాయించండి.

చాలా కుటుంబాల్లో ఇప్పుడు ఉదయం బ్రేక్ఫాస్ట్, సాయంత్రం స్నాక్స్ తగ్గిపోయాయి. వీలయితే అలా ప్లాన్ చెయ్యండి. కూర్చుని చేయదగ్గ పనుల్లో మీ అత్తమామల్ని భాగస్వాముల్ని చెయ్యండి. మీ అంత బాగా చెయ్యకపోయినా మెచ్చుకోండి. మీకంటూ కచ్చితంగా కొంత సమయం కేటాయించుకోండి. మౌనంగా పని చేసుకుంటూ పోతే ఇంట్లో వారు గమనించరు. మీ ఆరోగ్యమూ పాడవుతుంది. అలాగని అనవసరంగా గొడవ పడకుండా మంచిమాటలతో పని అలవాటు చెయ్యండి.
మొదట్లో కష్టమే కానీ అసాధ్యం కాదు. ఆల్ ద బెస్ట్!

-కె.శోభ,
ఫ్యామిలీ కౌన్సెలర్,
హార్ట్ టు హార్ట్,
[email protected]

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com