Saturday, July 27, 2024
HomeTrending Newsఈటెలది ఆస్తుల మీద గౌరవం: పల్లా

ఈటెలది ఆస్తుల మీద గౌరవం: పల్లా

ఈటెల రాజేందర్ ది ఆస్తుల మీద గౌరవమా, ఆత్మ గౌరవమా అని టిఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీలోకి వచ్చినప్పుడు దేవుడిలాగా కనపడ్డ కెసియార్ ఇప్పుడు నియంత లాగా కనబడ్డారా అని నిలదీశారు. కన్నతల్లి లాంటి పార్టీపై ఆరోపణలు చేశారని, ఈటెల తీరు పాలు తాగి రొమ్ము గుద్దినట్లయిందని ధ్వజమెత్తారు. పార్టీలో చేరినప్పుడు అప్పటికి నాయకత్వ లక్షణాలు లేకపోయినా ఈటెలను కేసియార్ అక్కున చేర్చుకుని ఆదరించారని, ఎన్నో ఉన్నత పదవులు కట్టబెట్టారని చెప్పారు.

ఒక అనామకుడు ఇచ్చిన పిర్యాదుపై ఎలా చర్య తీసుకుంటారని ఈటెల ప్రశ్నిస్తున్నారని, అదే ప్రజాస్వామ్య సంప్రదాయం అని పల్లా వ్యాఖ్యానించారు. బడుగుల మీద ప్రేమ ఉందని చెప్పుకుంటున్న ఈటెల అదే బడుగు బలహీన వర్గాల భూములు ఎలా ఆక్రమించారని, చట్ట వ్యతిరేకమైన దేవాలయ భూములు ఎలా కొంటారని అడిగారు. తెలంగాణా ఉద్యమ జెండా, అజెండా రూపొందించింది కేసిఆర్ మాత్రమేనని, కేసిఆర్ వల్లనే తెలంగాణ ఏర్పడిందని, నాయకులు చాలా మంది ఉండొచ్చు కానీ సారధి మాత్రం ఒక్కడే అని రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే ఆత్మ గౌరవం అంటున్నారని, అవమానం జరిగిన రోజే ఎందుకు మాట్లాడలేదని, అప్పుడే ఎందుకు రాజీనామా చేయలేదని పల్లా నిలదీశారు. అనవసరంగా నోరు పారేసుకుంటే సూర్యుడిపై ఉమ్మేసినట్లేనని అభివర్ణించారు. తన శాఖలో పని చేస్తున్న మహిళా ఎస్సీ అధికారిని మార్చాలని పట్టుబట్టిన విషయం మర్చిపోయారా అని ఈటెలను అడిగారు. అధికారులను పని చేసుకోనీయకుండా చేసింది వాస్తవం కాదా అనేది చెప్పాలని డిమాండ్ చేశారు. రాజేందర్ చెబుతున్న కలబోల్లి కబుర్లను తెలంగాణా మేధావులు, విద్యార్ధులు, సామాజిక ఉద్యమ కారులు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు.

ప్రగతి భవన్ లో గౌరవం దక్కలేదని, అడుగు పెట్టనీయలేదని ఈటెల చెప్పడం తనను తాను కించపరచుకోవడమేనని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిగాకే సిఎం కెసియార్ తీసుకున్నారని స్పష్టం చేశారు. అధికారులను అడ్డం పెట్టుకుని ఎన్నో పనులు చేయించుకొని, ఇప్పుడు వారిపైనే విమర్శలు చేస్తున్నారని బాలరాజు మండిపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్