Thursday, May 30, 2024
Homeఫీచర్స్చైతన్యవంతమైన ఓటరుకు ప్రతీక బైగా ఆదివాసీలు

చైతన్యవంతమైన ఓటరుకు ప్రతీక బైగా ఆదివాసీలు

ఆధునికతకు మారుపేరుగా చెప్పుకునే మహానగరాల్లో ఎన్నికలు, ఓటింగ్ ప్రక్రియ పట్ల నిరాసక్తత రోజు రోజుకు అధికం అవుతోంది. ప్రభుత్వాలు తప్పు చేసినపుడు అదే పనిగా విమర్శించటం… పట్టణాలు, నగరాల్లో మీడియా హోరెత్తించటం చూస్తున్నాము. ఇందుకు భిన్నంగా అభివృద్ధి జాడ లేని ప్రాంతంలో జీవనం సాగిస్తున్న ఆదివాసి బిడ్డలు… భారత పౌరులుగా ప్రాథమిక విధి నిర్వహించేందుకు సిద్దం అయ్యారు. చైతన్యవంతమైన ఓటరుకు ప్రతీకగా నిలిచారు బైగా ఆదివాసీలు.

పోలింగ్ విధుల కోసం వచ్చిన అధికార గణాన్ని ఘనంగా స్వాగతించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బైగా గిరిజనుల ఆధిపత్యం ఉన్న కుక్రపాణి పోలింగ్ బూత్‌లో అక్కడి బైగా అటవీవాసులు లోక్‌సభ ఎన్నికల పోలింగ్ బృందానికి అపూర్వ రీతిలో స్వాగతం పలికారు.

ఒకవైపు విద్యావంతులు, నాగరికులుగా చెప్పుకునే వారు ఓటు హక్కు వినియోగంలో ఉదాసీనంగా ఉంటున్నారు. మరోవైపు చదువుకోని వారు.. వెనుకబడిన వర్గం అని పిలవబడే ఆదివాసీలు దేశ రాజ్యాంగం పట్ల ఎంత అవగాహనతో ఉన్నారో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది.

అధికారులకు అందమైన అటవీ పూలతో చూడచక్కగా తీర్చిదిద్దిన బొకేలు అందించటంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కల్మషం లేని బైగా ఆదివాసీల మర్యాదను కొనియాడుతున్నారు. ఆత్మీయులను పేరంటానికి ఆహ్వానించినట్టుగా అధికారులను తీసుకు రావటం అందరిని అబ్బురపరుస్తోంది.

బైగా తెగకు చెందిన ప్రజలు చత్తీస్ ఘడ్ లో కవర్ధా, బిలాస్‌పూర్ జిల్లాల్లో అధికంగా ఉన్నారు. వీరు ప్రధానంగా మధ్యప్రదేశ్‌లోని దిండోరి, మాండ్లా, జబల్‌పూర్, షాడోల్ జిల్లాలో నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో బుధవారం లోక్ సభ ఎన్నికాల ప్రక్రియ ముగిసింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు మారుమూల గూడెం నుంచి కిలోమీటర్లు నడిచి వచ్చారు.

బైగా అడవి బిడ్డలా చైతన్యానికి ఎన్నికల సంఘం కూడా సలాం కొట్టింది. నిజమైన భారత పౌరులని కితాబు ఇచ్చింది. నాగరికత  ముసుగులో జీవిస్తున్న నగరవాసులు…వీరిని చూసి మేల్కోవాలని ఎన్నికల సంఘం కోరుతోంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్