Thursday, May 30, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమురిపించే హెడ్డింగులు

మురిపించే హెడ్డింగులు

Some Headings In Dailies Gives Much Sense And Strength To The News Item : 

జర్నలిజంలో భాష చాలా ప్రధానమే అయినా, ప్రత్యేకించి శీర్షికల భాష ఇంకా బాగుండాలి. శీర్షిక అంటే బరువై, హెడ్డింగ్ అంటేనే సులభంగా అర్థమయ్యే రోజులు వచ్చాయి కాబట్టి…మనం కూడా హెడ్డింగులే పెట్టుకుందాం. ప్రింట్, టీ వీ, రేడియో, డిజిటల్… ఏ మీడియాకయినా హెడ్డింగ్ శరీరానికి తలలాంటిది. వీలయినంత తక్కువ పదాలతో, అందంగా, సరళంగా, కవితాత్మకంగా, కుదిరితే యతి ప్రాసలతో, మొత్తం వార్తకు సంకేతంగా హెడ్డింగ్ ఉండాలి. చూడగానే, చదవగానే, వినగానే ఆకట్టుకోవాలి. బాగా ప్రచారంలో ఉన్న సామెతలు, నుడికారాలు, పాటలు, పద్యాలు, వాడుక మాటలను ఉపయోగించుకోవాలి. పదాల విరుపులో మెరుపు కనపడాలి. ఇదంతా సృజనాత్మక కళ. కొంతవరకు సాధనతో నేర్చుకోవచ్చు. విస్తృతంగా చదువుతూ, వింటూ కొంత నేర్చుకోవచ్చు.

తెలుగులో హెడ్డింగుల విషయంలో ఈనాడు చాలాకాలం పాటు శక్తివంచన లేకుండా కృషి చేసింది. తెలుగు జర్నలిజం చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసుకోదగ్గ ఎన్నో హెడ్డింగులను ఈనాడు ఇచ్చింది. ఇప్పుడు బాహ్యవలయ రహదారి అంతర వలయంలో తాకే తెర చరవాణుల్లో గుత్తేదారులు గగనసఖులతో అంతర్జాల సంభాషణలు చేసే సురభి పద్యనాటక కృతక భాషను కాపాడే పనిలో ఉండడం వల్ల హెడ్డింగుల మీద దృష్టి తగ్గినట్లుంది. తెలుగుమీద అమిత ప్రేమ ఉన్నవారు తెలుగులో రాయాలన్న పట్టుదలతో సంస్కృతంలో రాస్తుంటారు. లేదా తెలుగే అయినా జనం మాట్లాడని తెలుగు రాస్తుంటారు. దానికదిగా అదొక తెలుగు భాష అనుకుంటే సరి.

ఇంగ్లీషులో హెడ్డింగుల విషయంలో టైమ్స్ ఆఫ్ ఇండియా చాలా కష్టపడుతుంది. చూడగానే చదివి తీరాలనిపించేంత అందంగా, భావగర్భితంగా టైమ్స్ హెడ్డింగులు ఉంటాయి. ఇక రాజకీయాల్లోకి రానుగాక రాను అన్న రజనీకాంత్ వార్తకు-

“Gatham, Gatham-

No more politics for Rajani

గతం, గతం-

నో మోర్ పాలిటిక్స్ ఫర్ రజని”

అని టైమ్స్ బిజినెస్ దిన పత్రిక ఎకనమిక్ టైమ్స్ హెడ్డింగ్. అయిపోయిందేదో అయిపొయింది…అన్న అర్థంలో భారతదేశంలో అన్ని భాషల్లో అనాదిగా “గతం..గతః” అన్న సంస్కృతం మాట వాడుకలో ఉంది. ఆ మాటను రజనీకి సందర్భోచితంగా వాడుకుని హెడ్డింగ్ పెట్టిన జర్నలిస్ట్ ను అభినందించాలి. హిందీ, సంస్కృతాన్ని ఇంగ్లీషు పత్రికలు హాయిగా వాడుకుంటున్నాయి. నేటివిటీ టచ్ అంటే ఇదే.

పి వి సింధు ఒలింపిక్స్ లో రజత పతకం సాధించినప్పుడు టైమ్స్ బ్యానర్ హెడ్డింగ్-

“Silver medal, but golden standard

సిల్వర్ మెడల్, బట్ గోల్డెన్ స్టాండర్డ్”

ఇక వార్త చదవక్కర్లేదు. గెలిచింది రజత పతకమే అయినా దాని విలువ స్వర్ణ పతకం. ఏమి చమత్కారం? ఎంత చక్కటి విరుపు? ఎంత గౌరవం? ఎంత పులకింత

తొంభైల్లో ఇండియా టుడే ఇంగ్లీషు వార పత్రిక కవర్ పేజీ హెడ్డింగులు గొప్పగా ఉండేవి. ప్రధానిగా దేవే గౌడ బంధువులనందరినీ వెంటేసుకుని ప్రభుత్వ ఖర్చులతో విదేశీ ప్రయాణం చేసిన వ్యాసం కవర్ స్టోరీకి ఇండియా టుడే హెడ్డింగ్-

“A Gowda’s day out

ఎ గౌడాస్ డే అవుట్”

వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు జరిపిన పోఖ్రాన్ అణుపరీక్షల కవర్ స్టోరీ హెడ్డింగ్

“Jai Sree Bomb

జై శ్రీ బాంబ్”

అమెరికా డాలర్ తో భారత్ రూపాయి విలువ దారుణంగా పడిపోతున్న కవర్ స్టోరీ హెడ్డింగ్-

“Virupee విరూపి”

ఇలా ప్రతివారం జర్నలిస్టులు నేర్చుకోదగ్గ స్థాయిలో ఉండేవి కవర్ పేజీ మీద హెడ్డింగులు. ఎ బేబీస్ డే అవుట్;

జై శ్రీ రామ్;

విరూపం

మాటలను అంతటి సీరియస్ విషయాలకు హెడ్డింగ్ గా పెట్టాలంటే ఆ జర్నలిస్టుకు ఎంతటి భాషా జ్ఞానం ఉండి ఉండాలి? రూపాయికి రూపం లేకుండాపోయిన వ్యాసానికి విరూపం హెడ్డింగ్ గా పెట్టాలంటే ఎంత సమయస్ఫూర్తి ఉండి ఉండాలి. నిజానికి జై శ్రీ, విరూపి మాటలు ఇంగ్లీషు కానే కావు. కానీ ఒదిగాయి. ఒదిగేలా జర్నలిస్టు చేశాడు.

మనసుంటే మార్గముంటుంది. హెడ్డింగులు పెట్టడం గొప్ప విద్య. కళ. ప్రతి విద్యను, కళను నేర్చుకునే మెళకువలు కొన్ని ఉంటాయి. మీడియాలో హెడ్డింగులు పెట్టే స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన విద్య ఇది.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : పుస్తకాలు లేని చదువులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్