Friday, May 31, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపుస్తకాలు లేని చదువులు

పుస్తకాలు లేని చదువులు

Online Education Problems : 

చదువు సరిగా సాగకపోతే వానాకాలం చదువులు అనేవారు. ఇప్పుడవి కరోనా చదువులయ్యాయి. ఎప్పుడైనా నష్టపోయేది మాత్రం గ్రామీణ, పేద విద్యార్థులే.
ఏటా జూన్ మాసం వచ్చేసరికి స్కూళ్ల హడావుడి మొదలయ్యేది. అంతకుముందే పుస్తకాలు తెచ్చుకుని రెడీ అయ్యేవాళ్ళు పిల్లలు. టీచర్ చెప్పేటప్పుడు, ఇంటికొచ్చాక పుస్తకంలో చూసుకోవడం, నోట్స్ రాసుకోవడం ఒక పధ్ధతి. చాలామంది టెక్స్ట్ బుక్స్ పైనే ఎక్కువ ఆధారపడతారు కూడా.

రెండేళ్లుగా విద్యార్థులు చదవకుండానే పాసవుతున్నారు. తరగతి గదిలో టీచర్ చెప్పేది వినడానికి సెల్ ఫోన్, కంప్యూటర్ ముందు కూర్చుని పాఠాలు నేర్చుకోడానికి చాలా తేడా ఉంది. అయినా అసలు లేకపోవడం కంటే నయమని తల్లిదండ్రులు భావిస్తున్నారు. అప్పో సప్పో చేసి పిల్లలకు సెల్ ఫోన్ కొంటున్నారు. ఆపైన డేటా భారం అదనం. ఇక్కడ కూడా పట్టణ విద్యార్థులు బాగానే అందిపుచ్చుకుంటున్నారు. వీరికి పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. ఫోనుల్లో సాంకేతిక సమస్యలూ తక్కువే. దాంతో ఎంతో కొంత నేర్చుకోగలుగుతున్నారు.

Online Education Problems : 

పల్లెటూళ్లలో, గిరిజన గ్రామాల్లో ఎక్కువగా పుస్తకాల చదువులే ఆధారం. ఆపై అయ్యవార్ల దయ. అక్కడక్కడ టీచర్లు వాట్సాప్ ద్వారా విద్యార్థుల సందేహాలు తీరుస్తున్నా చాలా మందికి చేరడం లేదు. సెల్ ఫోన్ చదువులే దిక్కయిన కాలంలో సిగ్నల్స్ అందక చెట్లు, గుట్టలెక్కి చదువుకుంటున్న వార్తలు వింటూనే ఉన్నాం. ఇలాంటి వారికి పుస్తకాలు తోడుంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. పాఠాలు చదువుకుని సిగ్నల్ దొరికినప్పుడే టీచర్లను సందేహాలు అడిగే వీలు ఉంటుంది. మరి క్లాస్ పుస్తకాలే దొరక్కపోతే? ప్రస్తుతం అదే పరిస్థితి. జూన్ నెలాఖరుకైనా అందాల్సిన పుస్తకాలు జూలై వచ్చినా లేవ. ప్రభుత్వం మెజారిటీ జిల్లాల విద్యాధికారులకూ పంపినా విద్యార్థులకు అందలేదు. చాలా నెమ్మదిగా నత్తనడకన సాగుతున్న పుస్తకాల పంపిణీ ద్వారా ఇప్పటివరకు కేవలం 20 శాతం విద్యార్థులకే బుక్స్ అందాయి. ఇంకా ఎనభై శాతం సెల్ ఫోన్ సిగ్నల్ పైనే ఆధారపడ్డారు.మరి వారందరికీ అందేదెప్పుడో!

‘తలదించి నన్ను చూడు – తల ఎత్తుకునేలా చేస్తా’ అంటుంది పుస్తకం. ఎలా చూసినా సిగ్నల్ ఉంటేనే ఉపయోగం అంటుంది సెల్ ఫోన్. రెండూలేక దిక్కులు చూస్తున్నాడు విద్యార్థి పాపం!

-కె. శోభ

Also Read : అప్పు మీది- భరోసా మాది

RELATED ARTICLES

Most Popular

న్యూస్