Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

పాఠశాలను విద్యార్థి నుంచి వేరుచేసిన కరోనా అడ్డుగోడను తొలగించి.. గోడనే బ్లాక్ బోర్డ్ చేశారు.. కాకులు దూరని కారడవుల్లోని గిరిజన గూడాన్నే బడిగా మార్చారు.

అఆఇఈలకే పరిమితమైన పిల్లలకు అక్షరపాళయ్యారు. మొత్తంగా.. పోలీసంటే దుష్ట రక్షణే కాదు.. శిష్ఠరక్షణ కూడా అని నిరూపించిన హ్యూమన్ యాంగిల్ టచ్ అక్కడి పోలీస్.

అక్షరం ముక్క కొత్తగా రావడంలేదన్న ఆందోళన కన్నా.. వచ్చింది కాస్తా మర్చిపోతున్నారే.. అనే.. పిల్లల విషయంలో తల్లిదండ్రుల ఆవేదన ఆ సూపర్ పోలీస్ చెవినబడి.. ఆ గూడాలే ఇప్పుడు బడులై.. వీధివీధిన ఇంటిగోడలే తెలుగు అక్షరమాల నుంచి ఆంగ్ల ఆల్ఫాబెట్స్ మీదుగా.. లెక్కలు తేల్చే ఎక్కాల పట్టికలయ్యాయి.

చిన్నాచితకా ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తూ.. పోటీపరీక్షల్లో నెగ్గి పోలీసులయ్యేవాళ్లను ఎందరినో చూసిన ఈ సమాజానికి… లాఠీ పట్టిన ఖాకీఖదర్ ను కాస్తా పక్కకు పెట్టి.. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ అనేలా రూపాంతరం చెందిన పోలీసులోని కొత్త మానవీయ కోణం తిర్యాణీ పోలీస్.

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అంటేనే అటవీప్రాంతం. కొన్ని గిరిజన గూడాలకు వెళ్లి రావడమంటేనే ఓ అడ్వెంచరస్ ఫీట్. అలాంటి మంగీ, కొలాంగూడ, హాస్టల్ గూడ, రోంపెల్లి, మేస్రంగూడ, పంగిడిమాధర, మొర్రిగూడ, తలండీ వంటి సుమారు 30 గూడాల్లో ఇప్పుడు తిర్యాణీ పోలీసులంటే.. వారి పిల్లల గురువులు.

వర్చువల్ క్లాసెసంటే ఏంటో తెల్వదు.. ఇప్పటికీ ఈ గూడాల్లో చాలామందికి మోబైల్ ఫోన్లూ అంతగా అందుబాటులో లేవు. అందుబాటులో ఉన్న ఫోన్లకు సిగ్నల్స్ అంతకన్నా ఉండవు. బళ్లేమో బందైపాయె.. ఉన్న సర్కారీ బళ్లల్లో మామూలు సమయాల్లోనే ఇలాంటి గూడాలకు రాని ఉపాధ్యాయులు.. ఈ వేళ కనీసం ట్యూషన్లకు అందుబాటులో లేకపాయె.. ఎవరైనా ఒకరో, ఇద్దరో తారసపడ్డా కరోనా భయం భౌతికదూరాన్ని గుర్తు చేసి.. వారినీ దూరం చేసే!! మరెలా.. పిల్లల చదువులు..? ఈ ఈతి బాధే తిర్యాణీ ఎస్సై పుష్పాల రామారావు చెవిన పడింది. అప్పటికే పలు వినూత్న కార్యక్రమాలతో అక్కడి సమాజంలో చర్చనీయాంశమైన రామారావు.. ఆలోచించాడు. ఆ గిరిజన గూడాలన్నీ తిరిగాడు. అలా తిరిగిన గూడాల్లో గోడలు ఎస్సై రామారావును ఆకట్టుకున్నాయి. దాంతో గోడలనే బ్లాక్ బోర్డులుగా మార్చేసి.. గూడాన్నే బడి చేసేస్తే.. కావల్సినంత సోషల్ డిస్టెన్స్ తో విద్యార్థులను.. వీధులను శుభ్రం చేసి కూర్చోబెట్టేస్తే.. అంతకంటే ఈ కోవిడ్ వేళ మంచి బడేముంటందనిపించింది రామారావుకి..?!!

పాఠాలు చెప్పే గురువులెవరూ మరి…? అదే గూడాల్లో కాస్తో, కూస్తో చదువుకున్న సీనియర్ విద్యార్థులనే గురువులుగా మల్చారు. ఆది గురువుగా ఎస్సై రామారావు పాఠ్యారంభంతో ప్రారంభమైన ఆ 30 గూడాల్లోని బళ్లన్నీ.. ఇప్పుడు శిశు తరగతి నుంచి మూడు, నాల్గు తరగతుల పిల్లలకు ఓపెన్ స్కూల్సయ్యాయి.

పిల్లలు ఇండ్లల్లోంచి బయటకొస్తే చాలు.. అన్యమనస్కంగానైనా అటువైపే తమ చూపు లాగేలా.. వీధుల గోడలన్నీ అక్షరమాలలయ్యాయి. అక్కడి పటేళ్ల సాయంతో… ఓవైపు తమ ఉపాధ్యాయులన్న గురుభావంతో పాటు.. పోలీసులన్న కూసింత భయంతో.. ఇప్పుడా గూడాలన్నీ లాక్డౌన్ మినహాయింపు వేళ.. కరోనా కాలంలోనూ మిగతా ప్రపంచానికి భిన్నంగా వర్చువల్ అన్న మాటెరుగని తరగతి గదులయ్యాయి. అలా ఎస్సై రామారావు సృజనాత్మక ఆలోచనతో తిర్యాణీ పోలీసుల ప్రత్యే’కథ’య్యాయి.

-రమణ కొంటికర్ల

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com