Bappi Lahari: సుప్రసిద్ధ సంగీత దర్శకుడు బప్పిలహరి కన్నుమూశారు. అయన వయసు 69 సంవత్సరాలు. పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్ గురి లో 1952 నవంబర్ 27 న జన్మించారు. భారతీయ సినీ సంగీతంలో డిస్కో తరహా సంగీతాన్ని జొప్పించిన ఘనత బప్పిలహరికే దక్కింది. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ, గుజరాతీ భాషల్లో వందలాది సినిమాలకు అయన సంగీతం అందించారు.
తెలుగులో మొదటగా అయన సంగీతం అందించిన సింహాసనం సినిమా పాటలు నేటికీ సినీ అభిమానులకు వీనుల విందు అందిస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు సినిమాలకు అయన స్వరాలూ సమకూర్చారు. సింహాసనం సినిమాలో ‘ఆకాశంలో ఒక తార …’ సినిమా తెలుగు సినీ సంగీతంలో ఓ కలికి తురాయి పాటగా నిలిచింది.
హిందీలో చల్తే చల్తే, డిస్కో డ్యాన్సర్, షరాబీ సినిమాలతో ఖ్యాతి గడించారు. తెలుగులో తేనె మనసులు, స్టేట్ రౌడీ, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, బిగ్ బాస్, రౌడీ ఇన్ స్పెక్టర్, నిప్పురవ్వ, దొంగ-పోలీస్, బ్రహ్మ, రౌడీ గారి పెళ్ళాం… అయన సంగీతం అందించిన సూపర్ హిట్ సినిమాలుగా చెప్పవచ్చు. 2020లో రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజా సినిమాకు అయన ఓ పాట కూడా ఆలపించారు.
మెడలో భారీ బంగారు ఆభరణాలు ధరించి ప్రత్యేక ఆహార్యంతో ఆకట్టుకునేవారు. రాజకీయ రంగంలో కూడా ప్రవేశించిన బప్పీలహరి బిజెపిలో చేరి 2014 లో బెంగాల్ రాష్ట్రంలోని శ్రీరాంపూర్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. నెల రోజులుగా అనారోగ్యంతో ముంబై , జుహులోని క్రిటికేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేటి ఉదయం మరణించారు.