తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ పండుగ. ప్రకృతిలో లభించే తీరొక్క పూలను సేకరించి వాటిని అందంగా వలయా కృతిలో పేర్చి అమ్మవారు పార్వతీదేవికి ప్రతిరూపమైన గౌరమ్మను ప్రతిష్టించి కొలిచే అద్భుతమైన పండుగ బతుకమ్మ వేడుక. పట్నాల నుంచి పల్లెల దాకా.. దేశ విదేశాల్లో తెలుగు మహిళల పూల సంబురంతో పుడమి తల్లి పులకరించింది.

 

ప్రపంచంలో ఆడ బిడ్డలు పువ్వులను పూజించే సంస్కృతి కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే వుంది. తెలంగాణ ఆడ బిడ్డల ఆత్మ గౌరవం ఈ బతుకమ్మ పండుగ. రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మధ్యాహ్నం నుంచే ప్రారంభమైన వేడుకలు పొద్దు పోయే వరకు ఉత్సాహంగా సాగాయి.

ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియం లో ఏర్పాటు చేసిన సద్దుల బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు. లాల్ బహదూర్ స్టేడియం నుండి ట్యాంక్ బండ్ మీదుగా బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహిస్తున్న భారీ ఊరేగింపు ను ప్రత్యేక గౌరీ పూజలు నిర్వహించి  మంత్రి భారీ ర్యాలీని ప్రారంభించారు.

 

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ శ్రీమతి విజయలక్ష్మి, వివిధ ప్రభుత్వ శాఖ ల చైర్మన్ లు జూలూరు గౌరీ శంకర్, దీపికా రెడ్డి, డిప్యూటీ మేయర్ ఇందిరా శోభన్ రెడ్డి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, సంచాలకులు మామిడి హరికృష్ణ, పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, ఇతర ప్రభుత్వ శాఖ ల అధికారులు పాల్గొన్నారు.

హైదరాబాద్ నెక్లెస్ రోడ్ కర్బలా మైదానంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగాయి. వేలాదిగా పాల్గొన్న మహిళలు బతుకమ్మ పాటలతో గౌరమ్మను సాగనంపారు. బతుకమ్మ పాటలు, కోలాటాలతో కర్బలా మైదానం పరిసరాలు సందడిగా మారాయి.

సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆడబిడ్డ్లకు శుభాకాంక్షలు తెలిపారు.

సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల ఆయా ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వరంగల్ జిల్లా పర్వత గిరి, అన్నారం, మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం సోమారం, అమ్మా పురం, తొర్రూరు, నాంచారి మడూరు, జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం వావిలాల, దర్దేపల్లి, పాలకుర్తి, గూడూరు, వరంగల్ ఉర్సు గుట్ట రంగలీలా మైదానం, పద్మాక్షి గుట్ట లో మహిళలతో కలిసి మంత్రి బతుకమ్మను ఎత్తుకున్నారు. అనంతరం ఆయా చోట్ల మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కోలాటం కూడా ఆడారు.

తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి సద్దుల బతుకమ్మ ప్రతీక అని రాష్ట్ర యస్ సి సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ లోని తన నివాసంలో కుటుంబ సభ్యులు తో కలిసి స్వయంగా బతుకమ్మను అలంకరించారు. తెలంగాణ ఉద్యమంతోటే విశ్వవ్యాప్తమైన బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదయాలలో బాగమైందని ఆయన చెప్పారు.

కరీంనగర్ లో జరిగిన బతుకమ్మ సంబురాల్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. నగరంలోని వివిధ కూడళ్ళలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని పార్టీ శ్రేణులు, మహిళలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *