Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్అలా జరిగి ఉండాల్సింది కాదు: బిసిసిఐ

అలా జరిగి ఉండాల్సింది కాదు: బిసిసిఐ

భారత క్రికెట్ జట్టు మేనేజ్మెంట్ నిబంధనలకు లోబడి వ్యవహరించాలని బిసిసిఐ సీనియర్ అధికారి వెల్లడించారు. ఇటీవల టెస్ట్ జట్టు ఓపెనర్ విషయంలో ఏర్పడిన గందరగోళంపై స్పందించారు. న్యూజిలాండ్ తో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో ఓపెనర్ శుభమన్ గిల్ గాయపడిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో ఇండియా నుంచి పృథ్వీషా లేదా దేవదత్ పదిక్కల్ ను ఇంగ్లాండ్ పంపాలని టీమ్ మేనేజ్మెంట్ భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ ని కోరింది. దీన్ని సెలక్షన్ కమిటీ తిరస్కరించింది.

ప్రస్తుత కోవిడ్ పరిస్థితులు, ఇంగ్లాండ్ తో జరిగే సుదీర్ఘ టూర్ ను దృష్టిలో పెట్టుకునే 20 మంది సభ్యుల జట్టును ఎంపిక చేశామని, శుభమన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు మళ్ళీ ఇక్కడి నుంచి పంపాల్సిన అవసరం లేదని సెలక్షన్ కమిటీ అభిప్రాయపడింది. అందులోను పృథ్వీషా, పదిక్కల్ ఇద్దరూ శ్రీలంక టూర్ లో ఉన్నారని, వారిని వెనక్కు పిలవడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.

ఈ అంశంపై బిసిసిఐ అధికారి స్పందిస్తూ మేనేజ్మెంట్ తనకు ఏదైనా అవసరం ఉంటే దాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) కార్యదర్శి జై షా లేదా సిఈఓ హేమంగ్ అమిన్ లను గానీ సంప్రదించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. జట్టు ప్రాక్టీస్, ఆటపై మేనేజ్మెంట్ దృష్టి పెట్టాలని, విదేశీ టూర్ లో ఉన్నప్పుడు ఏదైనా సమస్య వచ్చినా, ఎలాంటి అవసరం ఉన్నా బిసిసిఐని నేరుగా సంప్రదించవచ్చని, అంతేగానీ ఆటగాడిని మార్చాలంటూ నేరుగా సెలక్షన్ కమిటికి మెయిల్ పంపడంలో అర్ధం లేదని కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు. ‘నిధులు కావాలంటే బిసిసిఐ అధికారులను సంప్రదిస్తాము గానీ నేరుగా అకౌంటెంట్ ను అడగలేము కదా అని అధికారి వ్యాఖ్యానించారు. దేనికైనా ఓ పధ్ధతి, విధానం ఉంటాయని వాటిని అందరూ పాలించాల్సిందేనన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్