ఐపిఎల్-2021 సీజన్ సెప్టెంబర్ లో తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మన దేశంలో కాకుండా గత ఏడాది నిర్వహించినట్లే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో మ్యాచ్ లు జరుగుతాయి. ఇంకా 31 మ్యాచ్ లు నిర్వహించాల్సి ఉంది, వీటిని 21 రోజుల్లో పూర్తి చేసేలా షెడ్యూల్ తయారు చేస్తున్నారు. 10 రోజులపాటు రెండేసి, ఏడు రోజులపాటు ఒక్కటి, మరో నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్ లు నిర్వహిస్తారు.
కోవిడ్ కారణంగా ఐపిఎల్-2021 సీజన్ ను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మొత్తం 60మ్యాచ్ లు జరగాల్సి ఉండగా 29 మాత్రమే పూర్తయ్యాయి. మరో 31మ్యాచ్ లు జరగాల్సి ఉంది.
అక్టోబర్, నవంబర్ నెల్లల్లో జరగాల్సిన టి-20 వరల్డ్ కప్ కంటే ముందే ఐపిఎల్ ను ముగించాలని బిసిసిఐ భావిస్తోంది. ఐపిఎల్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి తీరాలని ఫ్రాంచైజీ ల యజమానులు, స్పాన్సర్లు ఒత్తిడి తెస్తున్నారు.
ఐతే భారత జట్టు ఇంగ్లాండ్ తో ఐదు టెస్టులు ఆడేందుకు వచ్చే నెలలో బయల్దేరుతోంది. ఈ సీరీస్ సెప్టెంబర్ 14 నాటికి పూర్తవుతుంది. ఇంగ్లాండ్ నుంచి నేరుగా ఆటగాళ్ళు ఎమిరేట్స్ చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని యోచిస్తున్నారు. ఐపిఎల్ కొనసాగిస్తే మాత్రం సెప్టెంబర్ లో సౌతాఫ్రికా తో భారత జట్టు ఆడాల్సిన టి-20 సీరీస్ రద్దవుతుంది. ఈ ఏడాది చివరి వరకూ భారత జట్టు ఆడాల్సిన షెడ్యూల్ రెండు మూడు రోజుల్లో ఖరారు కానుంది.