భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) మరోసారి క్రీడాభిమానులు సంతోషపడే నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ కు పది కోట్ల రూపాయల సాయం అందించబోతోంది. బిసిసిఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం వర్చువల్ గా జరిగింది. అధ్యక్షుడు సౌరవ్ గంగూలి, కార్యదర్శి జై షా దీనిలో పాల్గొన్నారు.
భారత క్రికెట్ మంత్రిత్వ శాఖ, ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ (ఐఓఏ)లతో మాట్లాడిన తరువాత ఈ సాయాన్ని ఎలా వినియోగించాలనే విషయమై ఓ స్పష్టత వస్తుందని బిసిసిఐ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే, వీటిలో రెండున్నర కోట్లు మన అథ్లెట్లు, టోక్యో ఒలింపిక్స్ కు బయల్దేరే ముందు తీసుకోవాల్సిన కఠోర శిక్షణకు, మరో ఏడున్నర కోట్ల రూపాయలు ప్రమోషన్, మార్కెటింగ్ అవసరాలకు వినియోగించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయం జరిగింది.
దేశంలో ఒలింపిక్స్ తో పాటు ఇతర క్రీడలకు తగిన ప్రోత్సాహం, తోడ్పాటు అందించేదుకు తాము ఎప్పుడూ ముందుంటుందని, ఇలా సాయం అందించడం ఇది తొలిసారి కాదని బిసిసిఐ ప్రతినిధి వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో కూడా కోట్లాది రూపాయలతో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు సమకూర్చింది.
జూలై 23న టోక్యో ఒలింపిక్స్ జరగనున్నాయి, ఈ విశ్వ క్రీడా సంబరాల్లో మనదేశం తరఫున పాల్గొంటున్న అథ్లెట్లు తమకు ఈవెంట్ ప్రారంభానికి వారం పదిరోజులపాటు ప్రపంచ స్థాయి అనుభవజ్ఞులతో శిక్షణ ఇప్పించాలని కోరుతున్నారు. దీనికోసం బిసిసిఐ నిధులను వినియోగించే అవకాశం ఉంది.