బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో బెంగుళూరు పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. 1086 పేజీలతో ఉన్న ఈ ఛార్జిషీట్ లో మొత్తం 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు. సినీ నటి హేమా రేవ్ పార్టీలో పాల్గొని డ్రగ్స్ సేవించినట్టు నిర్ధారించారు. ఆ పార్టీలో ఎండిఎంఏ డ్రగ్స్ ను హేమ సేవించినట్టు ఆధారాలున్నాయని, దానికి సంబంధించిన మెడికల్ రిపోర్టులను ఛార్జిషీట్‌కు జోడించారు. రేవ్ పార్టీ నిర్వాహకులుగా చిత్తూరు కు చెందిన డాక్టర్ రణధీర్ బాబు తో సహా 9 మందిపై, దీనిలో పాల్గొన్న హేమతో పాటు మొత్తం 79 మంది కలిపి 88మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. హేమ ఫ్రెండు వాసు ఈ పార్టీకి ఆమెను పిలిచినట్లు నిర్ధారించిన అధికారులు. వాసు, రణధీర్ బాబు, అరుణ్ కుమార్, నాగబాబు, అబూబక్కర్ తోపాటు నైజీరియన్ పేర్లు నిర్వాహకుల జాబితాలో ఉన్నాయి.
కాగా, దీనిపై హేమ ఓ తెలుగు వార్తా ఛానల్ తో మాట్లాడారు. “నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు.. బెంగళూరు పోలీసుల ఛార్జిషీట్‌లో నా పేరు వచ్చినట్టు తెలిసింది.. నేను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. ఛార్జిషీట్ నాకు వచ్చాక నేను స్పందిస్తాను.. నాకు ఉన్న సమాచారం మేరకు డ్రగ్స్ రిపోర్ట్‌లో నెగిటివ్ అని ఛార్జిషీట్‌లో వేశారు.. MDMA డ్రగ్స్ నేను తీసుకోలేదు” అని వివరించారు.