మనం తెలుగును అమృతం అంటాం. ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని గర్వంగా చెప్పుకుంటాం. కానీ, ఈ మాధుర్యం వెనుక ఉన్న అసలు సిసలైన ‘లాజిక్’ ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక భాష కేవలం మాటల కూర్పు మాత్రమే కాదు.. అది ఒక జాతి డీఎన్ఏ. ఆ డీఎన్ఏను ఒక శాస్త్రవేత్తలా విశ్లేషించి, తెలుగు భాషా మూలాలను ప్రపంచ పటంలో నిలబెట్టిన మహనీయుడు ప్రొఫెసర్ భద్రిరాజు కృష్ణమూర్తి.
1928, జూన్ 19. ప్రకాశం జిల్లా ఒంగోలులో భద్రిరాజు గారు జన్మించారు. అప్పట్లో విద్యాభ్యాసం అంటే కేవలం పుస్తకాల్లోని విషయాలను అప్పజెప్పడం. కానీ భద్రిరాజు గారి మేధస్సు మొదటి నుంచీ భిన్నంగా ఆలోచించేది.
1948లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో బి.ఏ (ఆనర్స్) పూర్తి చేశారు. అక్కడ ఆయనకు మన పాతకాలపు ‘పాండిత్యం’పై తిరుగులేని పట్టు దొరికింది. పద్యం, ఛందస్సు, అలంకార శాస్త్రం.. ఇవన్నీ ఆయనకు కొట్టిన పిండి. అయితే, ఆయనలోని జిజ్ఞాస కేవలం పద్యాలకే పరిమితం కాలేదు. 1950వ దశకంలో ఆయన అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి వెళ్లడం ఆయన జీవితంలోనే కాదు, భారతీయ భాషా చరిత్రలోనే ఒక చారిత్రక మలుపు. అక్కడ ఆయనకు ఆధునిక ‘లింగ్విస్టిక్స్’ పరిచయమైంది. ఒక తెలుగు పండితుడు.. అంతర్జాతీయ భాషా శాస్త్రవేత్తగా రూపాంతరం చెందిన అద్భుత ఘట్టం ఇది.

పెన్సిల్వేనియాలో ఆయన భాషను ఒక జీవమున్న పదార్థంగా చూడటం నేర్చుకున్నారు. భాష కాలంతో పాటు ఎలా మారుతుంది? ఒకే మూలం నుంచి పుట్టిన వివిధ భాషలు కాలక్రమేణా ఎందుకు వేరుపడతాయి? వీటికి గణిత సూత్రాల ద్వారా సమాధానం చెప్పవచ్చని ఆయన నిరూపించారు.
Vo:- 1955లో ఎం.ఏ, 1957లో పిహెచ్.డి పూర్తి చేశారు. ఆయన సిద్ధాంత వ్యాసం ‘తెలుగు ధాతువుల స్వరూప నిరూపణం’. తెలుగును కేంద్రీకృతం చేసుకొని తోటి ద్రావిడ భాషలలోని ధాతువుల తులనాత్మక పరిశీలన చేయడం అప్పట్లో ఒక సంచలనం. తులనాత్మక అధ్యయనం ద్వారా మూల ధాతువుల స్వరూపాలను పునర్నిర్మించే (Reconstruction) ప్రక్రియకు ఆయన శ్రీకారం చుట్టారు.
అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత, భద్రిరాజు గారు విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. 1962లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంధ్రదేశంలోనే మొదట భాషా శాస్త్ర శాఖ (Department of Linguistics) ప్రారంభమైనప్పుడు, ఆయన కేవలం 34 ఏళ్ల వయసులో వ్యవస్థాపక శాఖాధిపతి అయ్యారు.
Vo:- కేవలం బోధనకే పరిమితం కాకుండా, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా, ఆర్ట్స్ ఫాకల్టీ డీన్‌గా పాలనా దక్షతను చాటారు. ఆ తర్వాత 1986 నుండి 1993 వరకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా ఆయన చేసిన సేవలు అజరామరం. విశ్వవిద్యాలయం అంటే కేవలం డిగ్రీలు ఇచ్చే చోటు కాదు, అది మౌలిక పరిశోధనలకు కేంద్రం కావాలని ఆయన తపించారు.

భద్రిరాజు గారి పేరు వినగానే ప్రపంచవ్యాప్తంగా భాషావేత్తలకు గుర్తుకు వచ్చేది ఆయన రాసిన ‘The Dravidian Languages’. దీనిని ద్రవిడ భాషా శాస్త్రానికి దిక్సూచి అని చెప్పవచ్చు. అంతకుముందు వరకు ద్రవిడ భాషల గురించి పాశ్చాత్యులు రాసిన విషయాల్లో ఎన్నో సందేహాలు ఉండేవి. కానీ భద్రిరాజు గారు సుమారు 26 ద్రావిడ భాషలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. తెలుగు, తమిళం, కన్నడ మాత్రమే కాదు.. మధ్య భారతదేశంలోని గిరిజనులు మాట్లాడే గోండి, కుయి, కొండలాంటి భాషల మూలాలను కూడా వెలికితీశారు. ద్రావిడ భాషలకు సంబంధించి ఈ గ్రంథంలో తడవని అంశం లేదు. వర్ణాలు, పదాలు, వాక్యం, వ్యాకరణ విభాగాలు.. ఇలా ప్రతి అంశానికి సంబంధించి మూల ద్రావిడ భాషా స్వరూపాన్ని ఆయన పునర్నిర్మించారు.
భద్రిరాజు గారి మేధస్సు కేవలం గ్రంథాలకే పరిమితం కాలేదు. ఆయన దృష్టి సామాన్యుడి భాష మీదకు మళ్ళింది. అప్పట్లో తెలుగు అంటే కేవలం గ్రాంథికం అనే భ్రమ ఉండేది. కానీ, మనం నిత్యం మాట్లాడుకునే భాషకు కూడా ఒక అద్భుతమైన శాస్త్రీయత ఉందని ఆయన నిరూపించారు.
రైతులు, చేనేత పనివారు, శిల్పులు వాడే పదాల్లోనే భాష అసలైన ఆత్మ ఉందని నమ్మి, ‘వృత్తి పదకోశాలను’ తయారు చేశారు. ఇది భారతీయ భాషల్లోనే తొలి ప్రయోగం. నాగలి పట్టే రైతు వాడే పదం వెనుక ఉన్న చరిత్రను ఆయన వెలికితీశారు. జె.పి.ఎల్. గ్విన్‌తో కలిసి ఆయన రాసిన ‘A Grammar of Modern Telugu’ నేటి ఆధునిక తెలుగు భాషా వికాసానికి దిక్సూచిగా నిలిచింది.
విద్య, వైజ్ఞానిక రంగాలలో ప్రతిష్టాత్మకమైన ‘రాయల్ సొసైటీ ఆఫ్ ఎడింబరో’ 2004లో కృష్ణమూర్తి గారిని విద్వత్సభ్యులుగా (Fellow) ఎంపిక చేసింది. ఈ గౌరవం పొందిన ఏకైక భారతీయుడు ఆయనే కావడం విశేషం.

ఆడమ్ స్మిత్, ఛార్లెస్ డార్విన్ వంటి ప్రసిద్ధులు ఉన్న ఈ సంస్థలో కృష్ణమూర్తి గారికి చోటు దక్కడం, తెలుగు భాషా శాస్త్రానికి అంతర్జాతీయ వేదికపై దక్కిన పట్టాభిషేకం. దీనికి ముందు 1985లో ‘లింగ్విస్టిక్ సొసైటీ ఆఫ్ అమెరికా’ గౌరవ సభ్యత్వం కూడా పొందారు. ఆయన సాధించిన ప్రతి గౌరవం, తెలుగు అక్షరానికి అంతర్జాతీయ స్థాయిలో కల్పించిన గుర్తింపు.
ద్రవిడుల చరిత్ర పూర్వదశ విషయంలో భద్రిరాజు గారికి స్పష్టమైన అభిప్రాయాలు ఉండేవి. హరప్పన్ నాగరికత ద్రావిడ నాగరికత అని ఆయన స్థూలంగా అభిప్రాయపడ్డారు. ఆర్య, ద్రవిడ పదాలు జాతులను సూచించే పదాలు కావని, అవి భాషా సమూహాలని ఆయన భావించారు. ఆధునిక మానవ వికాసం ఆఫ్రికా నుండి మొదలైందనే సిద్ధాంతాన్ని దృష్టిలో ఉంచుకుని, ద్రావిడుల ప్రాక్చరిత్రను పునరాలోచించవలసిన అవసరం ఉందని ఆయన తరువాతి తరానికి దిశానిర్దేశం చేశారు.
ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. తెలుగు భాషా మూలాలను వెతికే ప్రతి పరిశోధకుడికి ఆయన ఒక దిక్సూచి. నేటి డిజిటల్ యుగంలో మనం మాట్లాడుకుంటున్న AI (Artificial Intelligence), కంప్యూటర్లకు భాషను ఎలా నేర్పాలి? అనే అంశాలకు ఆయన దశాబ్దాల క్రితమే మార్గదర్శనం చేశారు.
భాష అంటే కేవలం భావ వ్యక్తీకరణ కాదు.. అది ఒక జాతి చరిత్ర, ఒక జాతి విజ్ఞానం. ఆ విజ్ఞానాన్ని మనకు పరిచయం చేసి, మన భాషకు ప్రపంచస్థాయిలో గౌరవాన్ని కల్పించిన ఆ మహా మనీషికి వందనం. తెలుగు అక్షరం ఉన్నంత వరకు.. ఆ అక్షరం వెనుక ఉన్న తర్కం వెతికే ప్రతి గుండెలోనూ ‘భద్రిరాజు సంతకం’ సజీవంగానే ఉంటుంది.
(ఇందులో ప్రస్తావించిన చాలా విషయాలు ప్రఖ్యాత పండితుడు కె కె రంగనాథాచార్యులుగారి వ్యాసం నుండి తీసుకున్నవి)
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

