ప్రపంచం మొత్తాన్ని నవ్వించాలంటే.. ఆ మనిషికి ఎంత సంతోషం ఉండాలి? కానీ విచిత్రం ఏంటంటే.. కోట్లాది మంది ముఖాల్లో నవ్వులు పూయించిన ఆ పెదాల వెనుక, ఒక సముద్రమంత దుఃఖం దాగుంది. ‘నా కన్నీళ్లు ఎవరికీ కనిపించకూడదనే నేను వర్షంలో నడుస్తాను’అంటాడు చార్లీ చాప్లిన్ .
నవ్వడం ఒక కళ అయితే.. నవ్వుతూ పోరాడటం ఒక యుద్ధం. ఆ యుద్ధంలో గెలిచి, ప్రపంచ సినిమా చరిత్రపై తన సంతకాన్ని మౌనంతోనే రాసిన మహానుభావుడు చార్లీ చాప్లిన్. ఈ రోజు మనం చూస్తున్న ఈ లెజెండ్ వెనుక.. ఆకలితో అల్లాడిన ఒక పసివాడున్నాడు. 1889 ఏప్రిల్ 16. లండన్ నగరం తన వైభవంతో వెలిగిపోతుంటే, దానికి సరిగ్గా ఆవలి వైపున ఉన్న సౌత్‌లార్క్ మురికివాడల్లో ఒక విషాద గాథ మొదలైంది. చార్లీ పుట్టినప్పుడు ఆయనకు స్వాగతం పలకడానికి వెండి స్పూన్లు లేవు.. కనీసం పొట్ట నిండా గంజి పోసే దిక్కు కూడా లేదు.
ఆయన తండ్రి చార్లెస్ చాప్లిన్ సీనియర్.. ఒక అద్భుతమైన గాయకుడు. కానీ విధి వైపరీత్యం ఏమిటంటే, తన మధురమైన గొంతును మద్యానికి బానిస చేసేశాడు. కుటుంబాన్ని గాలికి వదిలేసి తండ్రి దూరమైతే.. పేదరికం, ఆకలి, సమాజపు వెక్కిరింతలు తల్లి హన్నా చాప్లిన్‌ను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. ఆమె మానసిక స్థితిని చిన్నాభిన్నం చేశాయి.

చిన్నారి చార్లీ, తన అన్నయ్య సిడ్నీతో కలిసి లండన్ వీధుల్లో చిల్లర నాణేల కోసం తిరిగేవాడు. ఆకలి ఎంత భయంకరంగా ఉంటుందో ఆయనకు ఐదేళ్ల వయసులోనే తెలిసింది. ‘నడుము వంగిపోయేంత ఆకలి’ అంటే ఏమిటో ఆ పసివాడు అనుభవించాడు. పరిస్థితులు ఎంతలా దిగజారాయంటే..
తలదాచుకోవడానికి ఇల్లు లేక వాళ్లు ‘వర్క్ హౌస్’ (నిరుపేదల శిబిరాలు) లో చేరాల్సి వచ్చింది.
అది శిబిరం కాదు.. పేదవాడి ఆత్మగౌరవాన్ని చంపే జైలు. అక్కడ పడిన కష్టాలు, చూసిన అవమానాలు, అనుభవించిన ఆకలి.. చార్లీ మనసులో ఒక బలమైన ముద్ర వేశాయి. అందుకే దశాబ్దాల తర్వాత ఆయన వెండితెరపై పేదరికాన్ని అంత సహజంగా చూపించగలిగారు. మనందరినీ కడుపుబ్బ నవ్వించిన ఆ ‘ట్రాంప్’ పాత్ర వెనుక.. లండన్ వీధుల్లో ఆకలితో ఏడ్చిన ఆ చిన్నారి చార్లీ ఆత్మ దాగుంది!
ఒకరోజు స్టేజ్ మీద పాడుతున్న హన్నా గొంతు ఒక్కసారిగా మూగబోయింది. ప్రేక్షకులు గోల చేస్తున్నారు, వెక్కిరిస్తున్నారు. అప్పుడు మేనేజర్ ఐదేళ్ల చార్లీని స్టేజ్ మీదకు నెట్టాడు. ఆ చిన్నారి చార్లీ తన తల్లిని అనుకరిస్తూ నృత్యం చేశాడు, పాట పాడాడు. ఆశ్చర్యం! ప్రేక్షకులు నవ్వుతూ స్టేజ్ మీదకు నాణేలు విసిరారు. చార్లీ మధ్యలో ఆగి, “ముందు ఈ నాణేలు ఏరుకుంటాను, తర్వాత పాడతాను” అన్నాడు. ఆ అమాయకత్వానికి లండన్ ఫిదా అయిపోయింది. అది చార్లీ చేసిన మొదటి ప్రదర్శన.. తన తల్లి కెరీర్ ముగిసిన రోజే ఆయన కెరీర్ మొదలైంది.

1910లో ఒక నాటక బృందంతో కలిసి చాప్లిన్ అమెరికా వెళ్లాడు. అక్కడ సినిమా అన్న కొత్త మీడియం అప్పుడప్పుడే పురుడు పోసుకుంటోంది. కీస్టోన్ స్టూడియోస్ లో చేరిన చార్లీకి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కావాలనిపించింది. ఒకరోజు కాస్ట్యూమ్ రూమ్‌లోకి వెళ్లి.. తనకు నచ్చినవి తీసుకున్నాడు.
- చాలా పెద్దగా ఉన్న ప్యాంటు.
- చాలా బిగుతుగా ఉన్న కోటు.
- చిన్న తల మీద ఇమడని ఒక టోపీ.
- పెద్ద సైజు షూస్ (వాటిని కుడిది ఎడమకు, ఎడమది కుడికి వేసుకున్నాడు).
- చేతిలో ఒక వంకర కర్ర.. ముఖం మీద ఒక చిన్న మీసం.
అలా ‘ది ట్రాంప్’ (The Tramp) జన్మించాడు. ఈ పాత్ర ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదవాడికి ఒక ప్రతినిధిగా నిలిచింది. వస్తువులు లేకపోయినా, గౌరవం కోసం పోరాడే ఒక సామాన్యుడికి ఈ పాత్ర నిదర్శనం.
చాప్లిన్ కేవలం కామెడీ చేయలేదు, ఆయన సామాజిక విమర్శ చేశాడు.
- The Gold Rush: లో ఆకలి వేసి తన బూటునే ఉడకబెట్టుకుని, దాని లేసులను నూడుల్స్ లాగా తినే సీన్ చూస్తే నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాదు. ఆకలిని అంతకంటే గొప్పగా ఎవరూ చూపలేరు.
- Modern Times: లో మనిషి యంత్రంలా మారిపోతున్న తీరును ఎండగట్టాడు. కన్వేయర్ బెల్ట్ మీద గడియారపు ముల్లులా పని చేసే మనిషి, చివరికి తనను తాను యంత్రంలో ఇరికించుకునే దృశ్యం మనిషి యాంత్రీకరణకు పరాకాష్ట.
- The Kid: ఒక అనాథ పిల్లాడిని పెంచే తండ్రిగా చాప్లిన్ చూపిన ఎమోషన్స్ చూస్తే కళ్లు చెమ్మగిల్లని వారుండరు.

1940వ దశకం. ప్రపంచం రెండో ప్రపంచ యుద్ధం నీడలో ఉంది. అడాల్ఫ్ హిట్లర్ అరాచకాలు చేస్తున్నాడు. హిట్లర్, చాప్లిన్ ఇద్దరూ ఒకే నెలలో, ఒకే సంవత్సరంలో పుట్టారు (ఏప్రిల్ 1889). ఇద్దరికీ ఒకే రకమైన మీసం ఉంటుంది. కానీ ఒకరు ప్రపంచాన్ని హింసతో ఏలాలనుకుంటే, మరొకరు నవ్వుతో గెలవాలనుకున్నారు.
చాప్లిన్ ప్రాణాలకు తెగించి ‘The Great Dictator’ సినిమా తీశాడు. అందులో ప్రపంచాన్ని ఒక బంతిలా భావించి ఎగరవేసే సీన్ హిట్లర్ అహంకారాన్ని వెక్కిరిస్తుంది. ఆ సినిమా చివరలో చాప్లిన్ ఇచ్చే ఆరు నిమిషాల ప్రసంగం మానవ చరిత్రలో అత్యుత్తమ ప్రసంగాల్లో ఒకటి. “మనుషులకు ద్వేషం వద్దు.. మానవత్వం కావాలి” అని ఆయన గొంతు విప్పి చాటిన రోజు అది.
అమెరికా చాప్లిన్‌కు పేరు తెచ్చింది, కానీ అదే అమెరికా ఆయనను వేధించింది. ఆయన ఆలోచనలు కమ్యూనిజానికి దగ్గరగా ఉన్నాయని ఆరోపిస్తూ అమెరికా ఆయనను దేశం నుండి బహిష్కరించింది. ఆయన స్విట్జర్లాండ్‌కు వెళ్లిపోయారు.

కానీ కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది. 1972లో, అంటే 20 ఏళ్ల తర్వాత, అమెరికా తన తప్పు తెలుసుకుంది. ఆస్కార్ వేదికపై ఆయనకు “లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు” ఇచ్చి గౌరవించింది. చాప్లిన్ వేదిక మీదకు రాగానే, అక్కడున్న వారంతా లేచి నిలబడి (Standing Ovation) ఏకధాటిగా 12 నిమిషాల పాటు చప్పట్లు కొట్టారు. ఆస్కార్ చరిత్రలో ఇది ఒక రికార్డ్. ఆ సమయంలో చాప్లిన్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీరు ఆయన పడిన కష్టాలకు, పొందిన అవమానాలకు ప్రతిఫలం.
లైఫ్ లాంగ్ షాట్ లో చూస్తే కామెడీ.. క్లోజప్ లో చూస్తే ట్రాజెడీ- అన్నది చాప్లిన్ ప్రఖ్యాత కోట్. ఆయన నవ్వించాడు అంటే ఆయనకు దుఃఖం తెలియదని కాదు.. దుఃఖాన్ని దిగమింగి నవ్వించడం తెలుసు అని అర్థం.
ఆయన అన్నట్లు, “నవ్వు లేని రోజు వృధా అయిన రోజే.” ఈ రోజు ప్రపంచంలో యుద్ధాలు, ద్వేషం పెరుగుతున్న వేళ.. చాప్లిన్ లాంటి ఒక మౌన ముని, ఒక రంగుల్లేని కళాకారుడు మనకు ఎంతో అవసరం.
ఏప్రిల్ 16, చార్లీ చాప్లిన్ పుట్టినరోజున ఆయనను స్మరించుకోవడం అంటే.. మనలోని మానవత్వాన్ని, వైవిధ్యాన్ని, ఎదుటివారిని నవ్వించే గుణాన్ని గౌరవించుకోవడమే.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

