Wednesday, June 10, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅక్షరాలు ఎలా పుట్టాయి?

అక్షరాలు ఎలా పుట్టాయి?

మనిషి తన ఉనికిని చాటుకోవడానికి చేసిన మొదటి ప్రయత్నం ‘ధ్వని’, ఆ ధ్వనిని కాలంతో సంబంధం లేకుండా శాశ్వతంగా నిలిపి ఉంచడానికి కనుగొన్న అద్భుత ఆయుధం ‘అక్షరం’.
లక్షల ఏళ్ల క్రితం కేవలం ఆకలి కోసం, రక్షణ కోసం నాలుగు కాళ్లపై నడిచిన ఆదిమమానవుడు.. నిటారుగా నిలబడి విశ్వాన్ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? కేవలం చేతి సైగలతో మొదలైన భావ వినిమయం, నేడు ప్రపంచాన్ని నడిపిస్తున్న ‘సాఫ్ట్‌వేర్ కోడింగ్’ వరకు ఎలా పరిణామం చెందింది?
అక్షరం అంటే కేవలం ఒక గుర్తు కాదు.. అది ఒక శబ్దం, ఒక శక్తి, ఒక విజ్ఞాన సర్వస్వం. భారతీయ ఋషులు కనుగొన్న ‘మాహేశ్వర సూత్రాల’ నుండి, ఆధునిక కంప్యూటర్ భాషలకు పునాది వేసిన మహర్షి ‘పాణిని’ అష్టాధ్యాయి వరకు.. అక్షరాల పుట్టుక వెనుక ఉన్న ఆసక్తికరమైన రహస్యాలు, శాస్త్రీయ కోణాలను తెలుసుకుందాం రండి.

1. పరిణామం: నాలుగు కాళ్ల నుండి రెండు కాళ్ల వరకు : మానవ చరిత్రలో అతిపెద్ద మలుపు మనిషి నిటారుగా నిలబడటం. లక్షల ఏళ్ల క్రితం మానవుడు ఇతర జంతువుల్లానే నాలుగు కాళ్లపై నడిచేవాడు. ఆ సమయంలో అతడి దృష్టి కేవలం ఆహారం, రక్షణపైనే ఉండేది.

  • నిటారుగా నిలబడటం : ఎప్పుడైతే మనిషి రెండు కాళ్లపై నిలబడటం నేర్చుకున్నాడో, అప్పుడు అతడి చేతులు ఖాళీ అయ్యాయి. ఇది పరికరాల తయారీకి దారితీసింది.
  • ధ్వని యంత్రాంగం మార్పు: నిటారుగా నిలబడటం వల్ల గొంతు కిందికి దిగి, శ్వాసకోశ వ్యవస్థలో మార్పులు వచ్చాయి. దీనివల్ల కేవలం అరుపులే కాకుండా, వైవిధ్యమైన ధ్వనులను పలికే సామర్థ్యం మనిషికి అబ్బింది.
  • భావ వినిమయం: తొలినాళ్లలో మాటలు లేవు. కేవలం ముఖ కవళికలు (Expressions), కనుబొమల కదలికలు, చేతి సైగలే భాష. నేటికీ మనం మాటలు రాని పసిపిల్లలతో లేదా భాష తెలియని వారితో ఇలాగే సంభాషిస్తాం. అది మన ఆదిమ స్వభావం.

2. బొమ్మల భాష: గోడల మీద సంతకాలు:  మనిషి తన ఆలోచనలను భద్రపరచుకోవాలని అనుకున్నప్పుడు ‘లిపి’ పుట్టింది.

  • గుహా చిత్రాలు : వేటకెళ్లిన విశేషాలను, చూసిన జంతువులను మనిషి గుహల గోడలపై గీశాడు. ఇవే ప్రపంచంలో మొదటి ‘అక్షరాలు’.
  • చిత్ర లిపి : ఉదాహరణకు ‘సూర్యుడు’ అని చెప్పడానికి ఒక సున్నా గీయడం. ‘నడక’ అని చెప్పడానికి రెండు కాళ్లు గీయడం.
  • భావ చిత్రాలు : మెల్లగా ఈ బొమ్మలు ఒక ధ్వనికి సంకేతాలుగా మారాయి. ఈనాటికీ చైనీస్, జపనీస్ భాషల్లో మనకు ఈ చిత్ర లిపి కనిపిస్తుంది.

3. స్వతంత్ర అక్షరం: ధ్వని రూపం:  బొమ్మ నుండి అక్షరం విడివడటం ఒక విప్లవం. ఒక నిర్దిష్టమైన ధ్వనికి ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని ఇవ్వడమే అక్షరం.

  • అ-క్షరం: ‘క్షరం’ అంటే నాశనం అయ్యేది, ‘అక్షరం’ అంటే నాశనం లేనిది. మనిషి పలికిన ధ్వని గాలిలో కలిసిపోతుంది, కానీ దానిని ఒక గుర్తుగా చెక్కితే అది శాశ్వతంగా ఉండిపోతుంది.
  • బొమ్మల నుండి సంకేతాలు, సంకేతాల నుండి వర్ణాలు అంటే అక్షరాలు పుట్టాయి.

4. ప్రపంచ వర్ణమాలలు:  ప్రపంచంలో లిపి పరిణామం వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా జరిగింది:

  • సుమేరియన్ క్యూనిఫాం: మట్టి పలకలపై మొనదేలిన వస్తువులతో రాసేవారు.
  • ఈజిప్షియన్ హైరోగ్లిఫిక్స్: పవిత్రమైన చిత్ర లిపి.
  • ఫోనీషియన్ లిపి: నేటి గ్రీక్, లాటిన్ (A, B, C…) అక్షరాలకు ఇది పునాది.

5. భారతీయ లిపి వ్యవస్థ:  భారతీయ భాషలన్నీ దాదాపు బ్రాహ్మీ లిపి నుండే పుట్టాయి.

  • భారతీయ అక్షరమాల ప్రపంచంలోనే అత్యంత శాస్త్రీయమైనది. మన అక్షరాలను అచ్చులని, హల్లులని విభజించారు.
    హల్లులను కూడా అవి పలికే స్థానాన్ని బట్టి -కంఠ్యాలు, తాలవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు, ఓష్ఠ్యాలు ఇలా వర్గీకరించారు.

6. మాహేశ్వర సూత్రాలు: అక్షరాలకు దైవత్వం : భారతీయ సంప్రదాయం ప్రకారం అక్షరాలు పరమశివుడి డమరుకం నుండి ఉద్భవించాయి. దీనిని ‘నందికేశ్వర కాశిక’ వివరిస్తుంది.

  • నృత్తావసానే నటరాజరాజో
    ననాద ఢక్కాం నవపఞ్చవారమ్।
    ఉద్ధర్తుకామః సనకాదిసిద్ధాన్
    ఏతద్విమర్షే శివసూత్రజాలమ్ ॥ శివుడు తన తాండవ ముగింపులో 14 సార్లు డమరుకాన్ని వాయించాడు.
  • ఆ 14 ధ్వనులనే “మాహేశ్వర సూత్రాలు” అంటారు. అవి:-
  1. అ ఇ ఉ ణ్
  2. ఋ ఌ క్
  3. ఏ ఓ జ్
  4. ఐ ఔ చ్
  5. హ య వ ర ట్
  6. ల ణ్
  7. ఞ్ మ జ ణ న మ్
  8. ఝ భ ఞ్
  9. ఘ ఢ ధ ష్
  10. జ బ గ డ ద శ్
  11. ఖ ఫ ఛ ఠ థ చ ట త వ్
  12. క ప య్
  13. శ ష స ర్
  14. హ ల్
  • ఈ 14 సూత్రాలలోనే ప్రపంచంలోని మొత్తం ధ్వని విజ్ఞానం దాగి ఉంది. ఇవి కేవలం అక్షరాలు కావు, ఇవి ధ్వని తరంగాలు.

7. పాణిని అష్టాధ్యాయి: ప్రపంచపు మొదటి ప్రోగ్రామింగ్ కోడ్:  మహర్షి పాణిని రెండున్నర వేల ఏళ్ళ క్రితం రాసిన ‘అష్టాధ్యాయి’ భారతీయ వ్యాకరణశాస్త్రాలకు దారిదీపం.
శాస్త్రీయ దృక్పథం:-
పాణిని సంస్కృత భాషను కొన్ని వేల సూత్రాలలో బంధించాడు.

  • ప్రత్యాహారాలు: పెద్ద అక్షరాల సమూహాన్ని చిన్న కోడ్ రూపంలో చెప్పడం. ఉదాహరణకు ‘అచ్’ అంటే అన్ని అచ్చులు అని అర్థం. ఇది నేటి కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో వాడే ‘Variable’ వంటిది.
  • ఉత్తరోత్తరం బలీయం: ఒకే చోట రెండు సూత్రాలు వర్తించినప్పుడు, తరువాతి సూత్రమే బలమైనదిగా భావించాలి. ఇది లాజిక్ బిల్డింగ్.
  • ప్రపంచపు మొదటి కోడర్: నేడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు వాడే Backus-Naur Form (BNF) అనే మెటా లాంగ్వేజ్ పాణిని సూత్రాలనే పోలి ఉంటుంది. అందుకే పాణినిని “ప్రపంచపు మొదటి సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్” అని పిలుస్తారు. ఆయన రాసిన వ్యాకరణం ఒక ‘Generative Grammar’—అంటే కొన్ని సూత్రాలతో లక్షలాది కొత్త పదాలను సృష్టించవచ్చు.

8. అక్షరానికి ఉన్న శక్తి: మంత్రం: అక్షరాలను ఒక క్రమ పద్ధతిలో, నిర్దిష్టమైన పౌనఃపున్యంతో (Frequency) ఉచ్చరిస్తే అది మంత్రం అవుతుంది. “మంత్రాక్షరం” అంటేనే శక్తి అని అర్థం.

1. పరా(మెదడులో ఆలోచన)
ఇది ఒక చిన్న స్పందన. మనసులో ఏదో చెప్పాలనే ఒక కోరిక లేదా ఒక ఆలోచన మొదలయ్యే మొదటి క్షణం ఇది. ఇది ఇంకా ఏ రూపం తీసుకోదు.
* ఉదాహరణ: మీకు ఆకలి వేసినప్పుడు, లోపల ఏదో తెలియని ఒక అసౌకర్యం లేదా స్పందన కలుగుతుంది కదా? అది ‘పరా’.

2. పశ్యంతి(మాటకు ఊపిరితిత్తుల్లో ప్రయత్నం)
‘పశ్యంతి’ అంటే చూడటం. ఇక్కడ ఆ ఆలోచనకు ఒక స్పష్టమైన రూపం వస్తుంది. కానీ ఇంకా పదాలు రావు.
* ఉదాహరణ: ఆకలి వేసినప్పుడు మీ మనసులో ఒక ‘అన్నం ముద్ద’ లేదా ‘టిఫిన్’ బొమ్మ కనిపిస్తుంది. మీరు ఇంకా “అన్నం” అని అనలేదు, కానీ ఆ వస్తువు ఏంటో మీకు అర్థమైపోయింది.

3. మధ్యమ(స్వరపేటికలో మూర్ఛనలు )
ఇది మన లోపల జరిగే మాట. ఇక్కడ మన మెదడు ఆ బొమ్మకు తగిన ‘పదాలను’ వెతుక్కుంటుంది. ఇది భాషకు సంబంధించిన మెట్టు.
* ఉదాహరణ: మనసులో “అమ్మా! నాకు అన్నం పెట్టు” అని వాక్యాన్ని సెట్ చేసుకుంటాం. ఇది బయటకు వినిపించదు, కానీ లోపల సిద్ధంగా ఉంటుంది.

4. వైఖరి(పెదవి దాటి వినిపించే మాట)
ఇది చివరి మెట్టు. గాలి సహాయంతో గొంతు, నాలుక ఉపయోగించి మనం బయటకు పలికే మాట.
* ఉదాహరణ: “అమ్మా ఆకలి వేస్తోంది, అన్నం పెట్టు” అని నోటితో అనడం. దీనిని ఎదుటివారు వింటారు.

చిన్న ఉదాహరణతో సారాంశం:
ఒక చెట్టును తీసుకుంటే…
* పరా: భూమిలో ఉన్న విత్తనం (కనిపించదు కానీ శక్తి ఉంది).
* పశ్యంతి: నేల పగిలి వచ్చే చిన్న మొలక.
* మధ్యమ: కొమ్మలు, ఆకులు రావడం (సిద్ధం అవ్వడం).
* వైఖరి: పూలు, పండ్లు పూయడం (అందరికీ కనిపించడం).
మన ఋషులు ఈ రహస్యాన్ని కనిపెట్టారు. అందుకే మనిషి పలికే ప్రతి అక్షరానికి అంత శక్తి ఉంటుందని చెబుతారు.

నాలుగు కాళ్ల జంతువుగా ప్రయాణం మొదలుపెట్టిన మనిషి, నేడు అంతరిక్షంలోకి సందేశాలు పంపే స్థాయికి చేరాడు. ఈ ప్రయాణంలో ‘అక్షరం’ ఒక వంతెన. శివుడి డమరుక నాదం నుండి పాణిని సూత్రాల వరకు, బొమ్మల గీతల నుండి బైనరీ కోడ్ (0, 1) వరకు అక్షరం నిరంతరం పరిణామం చెందుతూనే ఉంది.
అక్షరం అమరం – అక్షరం అనంతం.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular