Monday, June 8, 2026

తెలుగు సంతకం-1

మన తెలుగు భాషకు ఒక ఆంగ్లేయుడు పునర్జన్మ నిచ్చాడంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది కదూ! కానీ అది అక్షర సత్యం. 1798లో కలకత్తాలో జన్మించి, ఇంగ్లాండ్‌లో పెరిగిన ఒక యువకుడు.. కేవలం 19 ఏళ్ల వయసులో మద్రాసు తీరంలో అడుగుపెట్టాడు. ఆయనే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఆయన ప్రయాణం ఒక అధికారిగా మొదలై, ఒక అక్షర తపస్విగా ఎలా మారిందో చూద్దాం

1817 ఆగస్టు 4… మద్రాసు రేవులో ఒక ఓడ ఆగింది. అందులో నుంచి దిగిన యువకుడు బ్రౌన్ కు అప్పటికి తెలియదు.. తను ఒక జాతి చరిత్రను మార్చబోతున్నానని. తండ్రి డేవిడ్ బ్రౌన్ పండితుడు కావడంతో, చిన్నతనం నుంచే బ్రౌన్ కు భాషల మీద మక్కువ ఉండేది. మద్రాసులోని ‘కాలేజ్ ఆఫ్ సెయింట్ జార్జ్’ లో ఆయన తెలుగు నేర్చుకోవడం ప్రారంభించారు. వెలగపూడి కోదండరామ పంతులు గారి వద్ద అక్షరాలు దిద్దిన బ్రౌన్, అతి తక్కువ కాలంలోనే తెలుగు పద్యాల్లోని ఛందస్సును, వ్యాకరణాన్ని ఆకళింపు చేసుకున్నారు. ఇది కేవలం ఒక భాషా అభ్యాసం కాదు.. ఒక అక్షర సామ్రాజ్యానికి పడిన పునాది.

కడపలో 200 ఏళ్ల క్రితం ఒక ‘అక్షర యజ్ఞం’ జరిగింది. కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన బ్రౌన్, తన నివాసాన్ని ఒక పరిశోధనా కేంద్రంగా మార్చేశారు. చరిత్ర దీనిని ‘బ్రౌన్ కాలేజీ’ అని పిలుస్తుంది. ఇక్కడ కూర్చుని ఆయన కేవలం ఫైళ్లు సంతకాలు చేయలేదు.. చెదలు పట్టిన తెలుగు సాహిత్యాన్ని ప్రక్షాళన చేశారు.

కడపలో బ్రౌన్ గమనించిన ప్రధాన సమస్య.. తాళపత్రాల్లో ఉన్న తప్పులు. ఒకే పద్యం పది ప్రతులలో పది రకాలుగా ఉండేది. దీనిని సరిదిద్దడానికి ఆయన ఒక వినూత్న పద్ధతిని చేపట్టారు. తన సొంత జీతంతో సుమారు 20 మంది పండితులను నియమించుకున్నారు. పల్లెటూళ్ల నుండి సేకరించిన తాళపత్రాలను పక్కన పెట్టుకుని, ప్రతి పదాన్ని పోల్చి చూస్తూ ‘శుద్ధ ప్రతి’ని తయారు చేసేవారు. నన్నయ్య భారతం నుండి మనుచరిత్ర వరకు.. ఎన్నో కావ్యాలు బ్రౌన్ బంగ్లాలోనే పునర్జన్మ పొందాయి. వేమన పద్యాలను సేకరించి, ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత కూడా ఈ అక్షర కర్మాగారానిదే.

సి.పి. బ్రౌన్ అంటే కేవలం పుస్తకాల పురుగు కాదు. ఆయన ఒక నిష్పాక్షికమైన న్యాయమూర్తి. ప్రజల భాష తెలిసిన అధికారిగా ఆయన కోర్టులో సామాన్యుడికి పెద్దపీట వేశారు. అధికార దర్పం ప్రదర్శించకుండా, ప్రజల కష్టాలను వారి భాషలోనే విన్న అరుదైన బ్రిటిష్ అధికారి బ్రౌన్ దొర.

మచిలీపట్నం, రాజమండ్రి, గుంటూరు ప్రాంతాల్లో జడ్జిగా పనిచేస్తున్నప్పుడు బ్రౌన్ ప్రజల పట్ల ఎంతో కారుణ్యాన్ని చూపేవారు. అప్పట్లో కోర్టులో పర్షియన్ భాష వాడేవారు, అది సామాన్యులకు అర్థమయ్యేది కాదు. బ్రౌన్ దానిని మార్చి తెలుగులో సాక్ష్యాలు చెప్పేలా ప్రోత్సహించారు. 1832-33 ప్రాంతంలో వచ్చిన ‘గుంటూరు కరువు’ సమయంలో ఆయన చేసిన సేవలు మరువలేనివి. ఖైదీలకు ఆహారం లేదని తెలిసి తన సొంత డబ్బుతో వారికి అన్నదానం చేశారు. పదవి ఉన్నా లేకపోయినా ఆయన దృష్టి అంతా తెలుగు జాతి సంక్షేమం మీదే ఉండేది.

భాషకు పునాది నిఘంటువు. బ్రౌన్ కంటే ముందు కొన్ని నిఘంటువులు ఉన్నా, అవి సామాన్యుడికి అందేవి కావు. బ్రౌన్ దొర పదేళ్ల పాటు శ్రమించి, పల్లెటూరి పదాలను కూడా కలిపి ఒక అద్భుతమైన నిఘంటువును తయారు చేశారు. ఈనాడు మనం తెలుగు పుస్తకాలు చదువుతున్నామంటే, దానికి ఆయన తెచ్చిన ముద్రణ విప్లవమే కారణం. 1852లో బ్రౌన్ ప్రచురించిన ‘తెలుగు-ఇంగ్లీష్’ నిఘంటువు ఒక మైలురాయి. కేవలం పదాల అర్థాలే కాకుండా, ఆ పదాన్ని సామెతల్లో, పద్యాల్లో ఎలా వాడతారో కూడా వివరించారు. అప్పటివరకు తెలుగు అక్షరాలు ముద్రణకు ఇబ్బందిగా ఉండేవి. బ్రౌన్ స్వయంగా అక్షరాల నమూనాలను గీసి, స్పష్టమైన ముద్రణ వచ్చేలా మార్పులు చేశారు. ఆయన ముద్రించిన పుస్తకాలు చౌకగా లభించడంతో, సామాన్యులకు కూడా సాహిత్యం అందుబాటులోకి వచ్చింది. తెలుగును తాళపత్రాల నుండి అచ్చు యంత్రాల దాకా నడిపించిన మహనీయుడు ఆయన.”

జీవితాంతం తెలుగు కోసం శ్రమించిన బ్రౌన్, రిటైర్మెంట్ సమయానికి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కానీ ఆయన సంపాదించిన అసలైన ఆస్తి.. ఆయన సేకరించిన వేలాది వ్రాతప్రతులు. ఆ అక్షర సంపదను పదిలంగా కాపాడి మనకు అందించిన ఆ త్యాగమూర్తి.

1855లో బ్రౌన్ ఇంగ్లాండ్ తిరిగి వెళ్లారు. అక్కడ కూడా ఆయన ఊరకనే ఉండలేదు. లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేస్తూ, విదేశీయులకు మన భాష గొప్పతనాన్ని చాటారు. తాను సేకరించిన సుమారు 2,000 తాళపత్రాలను ఇండియా ఆఫీస్ లైబ్రరీకి దానం చేశారు. ఆరోజు ఆయన ఆ గ్రంథాలను భద్రపరచకపోతే, నేడు మనకు ప్రాచీన కావ్యం ఒక్కటి కూడా మిగిలేది కాదు. 1884లో ఆయన కన్నుమూశారు. కానీ ఆయన వెలిగించిన అక్షర జ్యోతి నేటికీ ప్రకాశిస్తూనే ఉంది. తెలుగు అక్షరం ఉన్నంత కాలం బ్రౌన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.

ఒక పరాయి దేశస్థుడు మన భాష కోసం తన జీవితాన్ని, ఆస్తిని ధారపోయడం ప్రపంచ చరిత్రలోనే అరుదు. బ్రౌన్ దొర మనకి కేవలం పుస్తకాలు ఇవ్వలేదు.. మన భాషను తవ్వితీసి మనకే ఇచ్చారు. మన భాష మీద మనకు గౌరవాన్ని నేర్పారు. పరాయివారే మన భాషకు అంత సేవ చేస్తే మన మాతృభాషకు మనమెంత సేవ చేయాలో ఆలోచించుకోండి అనడానికి హిమాలయమంత ఉదాహరణగా నిలిచి ఉన్నారు.

నేడు మనం స్మార్ట్‌ఫోన్‌లలో తెలుగు వాడుతున్నా, తెలుగు వికీపీడియా చదువుతున్నా.. వాటన్నిటికీ పునాది బ్రౌన్ నిఘంటువులే. కడపలోని బ్రౌన్ లైబ్రరీ నుంచి లండన్ లోని మ్యూజియం దాకా ఆయన అడుగుజాడలు ఉన్నాయి. తెలుగు జాతి ఉన్నంత కాలం ‘ఆంధ్రభాషోద్ధారక’ సి.పి. బ్రౌన్ పేరు అజరామరం. తెలుగు అక్షరమే తన శ్వాసగా బతికిన ఆ మహనీయుడికి ధాత్రి టీవీ తరపున తెలుగు సంతకం డాక్యుమెంటరీ సాక్షిగా నమస్సులు. అయితే, కాలగర్భంలో కలిసిపోతున్న ఈ బ్రౌన్ వారసత్వాన్ని, ఆ బంగ్లా స్మృతులను మళ్ళీ వెలికితీసిన ఒక మహనీయుడిని మనం ఇక్కడ స్మరించుకోవాలి. ఆయనే జనుమద్ది హనుమచ్ఛాస్త్రి గారు. బ్రౌన్ తెలుగు భాషకు చేసిన సేవలను నేటి తరానికి అందించడానికి ఆయన తన జీవితాన్నే అంకితం చేశారు.

కడపలో బ్రౌన్ నివసించిన ఆ చారిత్రక బంగ్లా శిథిలావస్థకు చేరినప్పుడు, దానిని ఒక స్మారక గ్రంథాలయంగా తీర్చిదిద్దడంలో జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారు భగీరథ ప్రయత్నం చేశారు. 1986లో ‘సి.పి. బ్రౌన్ మెమోరియల్ ట్రస్ట్’ స్థాపించి, దేశవిదేశాల నుంచి విరాళాలు సేకరించి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నేడు మనం చూస్తున్న ‘సి.పి. బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం’ ఏర్పడటానికి కారణమయ్యారు. బ్రౌన్ ను ‘ఆంధ్రభాషోద్ధారకుడు’ అని మనం పిలుస్తున్నామంటే, ఆ కీర్తిని దశదిశలా చాటిన ఘనత జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారికే దక్కుతుంది. ఒక రకంగా చెప్పాలంటే బ్రౌన్ తెలుగుకు పునర్జన్మ నిస్తే, జానమద్ది గారు బ్రౌన్ స్మృతికి పునర్జీవం పోశారు.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular