పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్.. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ భేరీలో పాల్గొన్నారు. సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. కంటి వెలుగు ఎంతో ప్రభావంతమైన పథకమన్నారు. సభకు వచ్చిన జనం చూస్తుంటే అద్భుతంగా ఉందని, ఏవైనా ప్రత్యేక కండ్ల అద్దాలు తయారు చేసి ఉంటే, ఇంత జనాన్ని ఆ అద్దాల నుంచి చూసేవాడిని అంటూ భగవంత్ అన్నారు. ఈ దేశం రంగు రంగుల పూల సమాహారం అని, కానీ ఒకే పువ్వు ఉండాలని కొందరు చూస్తున్నారని ఆయన బీజేపీపై విమర్శలు చేశారు.
యువత ఉద్యోగాలు ఆశిస్తున్నారని, రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి ఏడాది ఇస్తామన్నారని, కానీ అవన్నీ జుమ్లాలుగా ఉండిపోయాయన్నారు. ఖాతాలోకి 15 లక్షల వస్తాయని హామీ ఇచ్చారు కానీ, అది కూడా అబ్ధంగా నిలిచిపోయిందని బీజేపీని విమర్శించారు. బీజేపీ అబద్ధాల పార్టీగా మారుతోందన్నారు. ఎమ్మెల్యేలను కొనడం, ఉప ఎన్నికల్లో గెలవడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. లోకతంత్రం కాదు.. లూటీ తంత్రాన్ని బీజేపీ నడిపిస్తోందని ఆయన ఆరోపించారు. కానీ సమయం అన్నీ నేర్పుతుందని, రాజుల్ని కూడా అడుక్కునేలా చేస్తుందని ఆయన బీజేపీకి హెచ్చరికలు జారీ చేశారు.
ప్రతి ఆగస్టుకు ప్రధాని ఢిల్లీ నుంచి సందేశం ఇస్తారని, కానీ ఎప్పుడూ ఆ ఉపన్యాసమే ఉంటుందని ఆయన విమర్శించారు. ఉగ్ర దాడుల పట్ల చింతను వ్యక్తం చేస్తూ.. ప్రధాని తన ప్రసంగాన్ని ముగిస్తారని, ఆ ప్రసంగాన్ని మార్చుకోవాలని సీఎం భగవంత్ మాన్ సూచించారు. అన్ని లూటీ చేయడమే బీజేపీ పని అని, రైల్వే, ఎల్ఐసీ, ఎయిర్‌పోర్టులను అన్నింటినీ అమ్మిందన్నారు. కేవలం మీడియాను కొనుగోలు చేసిందన్నారు. అన్ని తమకోసమే అన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందన్నారు. అన్ని రాష్ట్రాలను గెలుచుకోవాలని ఆరాటపడుతోందన్నారు.
కేజ్రీవాల్ స్కూళ్ల గురించి బీజేపీ సర్కార్ విమర్శలు చేసిందని, కానీ ట్రంప్ సతీమణి స్కూల్ చూడాలంటే, కేజ్రీవాల్ స్కూల్‌ను చూపించారని భగవంత్ విమర్శలు చేశారు. పంజాబ్‌లోనూ తెలంగాణ ప్రభుత్వం లాంటి పథకాలను ప్రవేశపెడుతామన్నారు. మంచి పనులు చూసి నేర్చుకోవాలన్నారు. ఇవి నాలెడ్జ్ షేరింగ్ రోజులన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన సీఎం కేసీఆర్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మంచి హృదయం ఉన్న నేతలు ఈ దేశంలో లేరని, వాళ్లుంటే ఈ దేశం సస్యశ్యామలం అవుతుందన్నారు. తన ప్రసంగం ముగించే ముందు ఇన్‌కిలాఫ్ నినాదం చేశారు. జిందా రహేతో ఫిర్ మిలేంగే.. మిల్తే రహేతో జిందా రహీంగే అంటూ భగవంత్ మాన్ పిలుపునిచ్చారు