రాజస్థాన్‌లో కొత్త సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. జైపూర్ సమీపంలోని సంగనేర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్ లాల్ శర్మ రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రి కానున్నారు. ఉప ముఖ్యమంత్రులుగా దియా కుమారి, ప్రేమ్ చాంద్ భైరవ బాధ్యతలు స్వీకరిస్తారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాజస్థాన్‌లో సిఎం ఎంపిక అంశంలో రాజకీయ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) మరియు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)తో అనుబంధం కలిగిన భజన్ లాల్ శర్మ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
సిఎం పదవికి భజన్ లాల్ శర్మ పేరును మాజీ సిఎం వసుంధర రాజే ప్రతిపాదించారు. దీనికి ఎమ్మెల్యేలందరూ ఆమోదం తెలిపారు. ఇంతకుముందు వసుంధర రాజే ముఖ్యమంత్రి పదవికి పోటీదారులలో ఉన్నా… క్రమంగా ఆమె పేరు సీఎం పదవి రేసులో లేకుండా పోయింది. శాసనసభా పక్ష సమావేశానికి ఎమ్మెల్యేల రాక ప్రారంభం కాగానే రేసులో పలువురి పేర్లు వినిపించాయి. సీఎం రేసులో దియా కుమారి, అనితా భాదేల్, కైలాష్ చౌదరి సహా పలువురి పేర్లు రేసులో కొనసాగాయి.
పార్టీ కార్యాలయంలో శాసనసభా పక్ష సమావేశం ప్రారంభం కాగానే, ఢిల్లీ నుంచి వచ్చిన పరిశీలకులు, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, వినోద్ తావ్డే, సరోజ్ పాండే, ఎన్నికల ఇన్‌ఛార్జ్ ప్రహ్లాద్ జోషి పలువురు బీజేపీ నేతలను వేర్వేరు గదుల్లో కలిశారు. శాసనసభా పక్ష సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికి జేపీ నడ్డా కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫోన్ చేశారు. ఆ తర్వాత మాజీ సీఎం వసుంధర రాజే చేతికి ఆ కాగితం ఇచ్చారు. ఈ స్లిప్‌లో రాష్ట్రానికి కాబోయే సీఎం పేరు ఉంది. వసుంధర రాజే మీడియా ముందుకు వచ్చి భజన్‌లాల్ శర్మ పేరును ప్రకటించారు.
లోకసభ ఎన్నికల నేపథ్యంలో బిజెపి ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇందుకు నిదర్శనమే మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి ఆదివాసి నేత విష్ణు దేవ్ సాయిని ఎంపిక చేశారు. ఆ రాష్ట్రంలో బలమైన ఆదివాసీ తెగకు చెందిన నేత విష్ణు దేవ్. అదే సమయంలో ఆయన పార్టీకి నమ్మిన బంటుగా పనిచేస్తున్నారు.
ఇక మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్ ఎంపిక ఎవరు ఉహించని పరిణామం. ఉజ్జయని దక్షిణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మోహన్ యాదవ్ మూడుసార్లు గెలిచారు. గత ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అంతకు మించి పార్టీ విధేయుడిగా పేరుతెచ్చుకున్నారు.
మూడు రాష్ట్రాల సిఎంల ఎంపికతో బిజెపి నాయకత్వం పార్టీ శ్రేణులకు బలమైన సంకేతాలు ఇచ్చింది. పార్టీకి విధేయులుగా పని చేసే వారినే పదవులు వరిస్తాయని…ఇతర పార్టీల మాదిరిగా లాబియింగ్ చేయటం మానుకోవాలని తెగేసి చెప్పినట్టయింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ నేతల పెడసరి వ్యాఖ్యలు…తిరుగుబాటు ధోరణితో పార్టీ ఈ విధంగా బదులిచ్చింది. ఆదివాసి,బీసి, బ్రాహ్మణ నేతలను సిఎం పదవికి ఎంపిక చేయటం ద్వారా రాబోయే లోకసభ ఎన్నికల్లో సామజిక వర్గాల సమతూకం పాటించే పార్టీ బిజెపి మాత్రమే అని చెప్పనున్నారు.
-దేశవేని భాస్కర్