చిన్నారుల కోసం చేపట్టిన వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. బిహార్ రాజధాని పాట్నాలో కోవాగ్జిన్ వ్యాక్సిన్ రెండో దశ పరిశీలన ఆరంభమైంది. పాట్నా ఏయిమ్స్( ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్) ఆస్పత్రిలో ప్రయోగాత్మకంగా టీకా పనితీరును పరీక్షిస్తున్నారు. త్వరలోనే ఇది అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉంది.
భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ అఫ్ ఇండియా మే 11వ తేదీన అనుమతులు మంజూరు చేసింది. రెండు, మూడు దశల ప్రయోగాలు విజయవంతమైతే 2 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ వయసు చిన్నారులకు దేశీయంగా తయారైన వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది.
రెండో దశ క్లినికల్ ట్రైల్స్ లో 525 అంశాలపై ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ అంశాలపై ఢిల్లీ, పాట్నా ఎయిమ్స్ తో పాటు నాగపూర్ మెడిత్రిన మెడికల్ సైన్సెస్ లో పరీక్షలు చేస్తున్నారు. 28 రోజుల కాల వ్యవధిలో రెండు డోసులుగా టీకా ఇస్తే ఎంతవరకు ఫలితం వస్తుందనే అంశం కీలకం కానుంది.
ఎయిమ్స్ పాట్నా లో 54 మంది పిల్లలు క్లినికల్ ట్రయల్స్ కోసం పేరు నమోదు చేసుకోగా అందులో 16 మంది పిల్లలు 12 నుంచి 18 ఏళ్ళ వయసు వారని ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి. మొదటగా 12 నుంచి 18 ఏళ్ళ వయసు వారిపై పరీక్షలు జరుపుతామని ఎయిమ్స్ సూపరిండేంట్ డాక్టర్ సిఎం సింగ్ వెల్లడించారు. ఆ తర్వాత 6 నుంచి 12 ఏళ్ళ వారికి, 2 నుంచి 6 ఏళ్ళ వారికి పరీక్షలు చేస్తామని డాక్టర్ సింగ్ స్పష్టం చేశారు.