భారత్ జోడో యాత్ర ఈ రోజు పుల్వామా జిల్లా అవంతిపొరా నుంచి ప్రారంభమైంది. జీలం నది తీరంలో సాగుతున్న కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పీపుల్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ పాల్గొన్నారు. అవంతిపొర సమీపంలోని చెర్సూ గ్రామం దగ్గర మెహబూబా ముఫ్తీ పాల్గొన్నారు. మరో రెండు రోజుల పాటు సాగే యాత్రలో పార్టీ శ్రేణులు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉండడంతో భద్రత పెంచారు. ఎల్లుండి శ్రీనగర్ లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. దీనికి కాంగ్రెస్ నేతలే కాకుండా ఇతర పార్టీల నేతలు కూడా హాజరు అవుతారు.
మరోవైపు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ కూడా శ్రీనగర్ చేరుకున్నారు. భారత్ జోడో యాత్ర ముగియనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఇందులో భారీగా పాల్గొనే అవకాశం ఉంది. కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ ఈ యాత్రను ప్రారంభించారు.
జమ్మూకశ్మీర్ లోని నిన్న జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ యాత్రలో రాహుల్ తో కలిసి నడిచిన విషయం తెలిసిందే. చివరి దశకు చేరుకున్న రాహుల్ జోడో యాత్రకు పోలీసులు భద్రత పెంచాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ముగింపు సభకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశం ఉండటంతో శ్రీనగర్ లో భద్రత కట్టుదిట్టం చేశారు.