Sunday, November 24, 2024
HomeTrending Newsప్రభుత్వరంగ సంస్థలు ప్రజల సొత్తు - రాహుల్ గాంధి

ప్రభుత్వరంగ సంస్థలు ప్రజల సొత్తు – రాహుల్ గాంధి

ప్రతీ రాష్ట్రంలో భారత్ జోడో యాత్రపై ప్రజలు తమ అభిమానాన్ని చూపుతున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. 25కి.మీ నడిచినా మాలో ఎవరికి అలసట రావటం లేదన్నారు. ఎందుకంటే ప్రజల ప్రేమాభిమానాలు మాకు అలసట అనేది లేకుండా చేస్తున్నాయని చెప్పారు. భారత్ జోడో యాత్ర లో భాగంగా ఈ రోజు హైదరాబాద్ శివారులోని ముత్తంగి లో జరిగిన కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధి ప్రసంగించారు.

దేశంలో విద్వేషాన్ని పారద్రోలి ప్రేమాభిమానాలు పెంపొందించడమే యాత్ర లక్ష్యమని రాహుల్ గాంధీ తెలిపారు. దేశంలో బీజేపీ విద్వేషాన్ని సృష్టిస్తోందని, ప్రజల్ని భయాందోళనకు గురి చేసి దేశాన్నీ అమ్మేసే కుట్ర చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ డైనమిక్స్ దేశ రక్షణ కోసం క్షిపణులను తయారు చేస్తోందని, ఈ క్షిపణులు దేశ రక్షణ కోసం పనిచేస్తున్నాయన్నారు. BHEL, BDL సంస్థలను ప్రయివేటీకరిస్తామని ఉద్యోగులను భయపెడుతున్నారని అన్నారు. ప్రభుత్వ సంస్థలు భారత దేశ మూలధనమని, బీజేపీ ప్రజల ఆస్తులను తమ వ్యాపార మిత్రులకు కట్టబెట్టాలని చూస్తోందని రాహుల్ విమర్శించారు.

ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరి సొత్తు కాదు.. ఇది దేశ ప్రజల సొత్తని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేయనీయమని స్పష్టం చేశారు. ఇందుకోసం ఉద్యోగులు, ప్రజల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుందని, దేశంలో, రాష్ట్రంలో యువకులకు చదువుకు తగిన ఉద్యోగాలు లభించడం లేదన్నారు. ఇంజనీరింగ్ చదివిన వారు కూలీలుగా పని చేస్తున్నారని, నరేంద్ర మోదీ ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముక లేకుండా చేశారని మంది పడ్డారు. నల్లధనాన్ని వెనక్కు తెస్తానన్న మోదీ.. నోట్ల రద్దు చేశారని, జీఎస్టీ పేరుతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను రోడ్డున పడేశారని ఆరోపించారు.

అక్కడ మోదీ చేసిందే ఇక్కడ కేసీఆర్ చేస్తున్నారని, తెలంగాణలో భూములు ఏమయ్యాయని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ధరణి పోర్టల్ పేరుతో అవినీతిలో మొదటి స్థానంలో కేసీఆర్ ఉన్నారన్నారు. బీజేపీ,టీఆరెస్ కలిసి పని చేస్తున్నాయని, ఢిల్లీలో మోదీకి కేసీఆర్, తెలంగాణలో కేసీఆర్ కు మోదీ సహకారం ఇచ్చుకుంటున్నారని చెప్పారు. ప్రజల్లో భయాన్ని పారద్రోలేందుకే భారత్ జోడో యాత్ర చేస్తున్నామని, ప్రభుత్వ సొమ్మును మోదీ తమ మిత్రులకు  కట్టబెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సొమ్మును రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఉపయోగిస్తున్నారని, కేసీఆర్ కమీషన్ల సొమ్మును తన కుటుంబ సభ్యులకు కట్టబెడుతున్నాడని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల సొమ్మును కాపాడేందుకే జోడో యాత్ర చేపట్టామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్