తనపై దాడికి పాల్పడిన వారిని చట్టబద్దంగానే ఎదుర్కుంటామని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ స్పష్టం చేశారు. దళిత సోదరులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. తను క్షేమగానే ఉన్నానని, కాల్పులు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని ప్రకటించారు.
ఆజాద్ సమాజ్ పార్టీ నేత… దళితుల హక్కులు, అభ్యున్నతి కోసం పోరాడుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. బుధవారం ఆయన తన మద్దతుదారు ఇంట్లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొని కారులో తిరిగి వెళుతుండగా సహారన్‌పూర్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఒక తూటా నడుమును తాకడంతో ఆజాద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆయనను దగ్గర్లోని దవాఖానకు తరలించారని, కేసు దర్యాప్తులో ఉందని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.
హర్యానా లైసెన్స్ నెంబర్ ప్లేట్ కలిగిన కారులో వచ్చిన దుండగులు చంద్రశేఖర్‌పై కాల్పులు జరిపారు. ఆ సమయంలో టయోటా ఫార్చ్యునర్ కారులో ప్రయాణిస్తున్నారు. కారులోని సీటు, డోర్ పై బుల్లెట్ తగిలినట్లు గుర్తించారు. చంద్రశేఖర్ ప్రయాణిస్తున్న కారు సమీపంలోకి దూసుకు వచ్చి పలు రౌండ్లు కాల్పులు జరిపారు.
కాల్పులకు తెగబడ్డవారిని తన అనుచరులు గుర్తించారని ఆజాద్ మీడియాకు తెలిపారు. బహుజన ఉద్యమాన్ని ఆపేందుకు ప్రయత్నించిన పిరికి చర్యగా కాల్పుల ఘటనను భీమ్ ఆర్మీ అభివర్ణించింది. కాల్పులపై సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ… యూపీలో జంగిల్ రాజ్ నడుస్తున్నదన్నారు. యోగీ ప్రభుత్వంలో దాడులు, హత్యలు సాధారణమయ్యాయని సీపీఐ జనరల్ సెక్రటరీ డీ రాజా ట్వీట్ చేశారు.